పవన్ సూటి ప్రశ్నలు..వైకాపా నేతలు సమాధానం చెప్తారా?

Pawan Kalyan
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వ తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దుయ్యబట్టారు.  దుర్ఘటన జరిగిన తీరు, ప్రభుత్వం అందించిన సహాయం, ప్రస్తుతం బాధిత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, కారకులైన ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్టీ నాయకులతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు.  వైఎస్ జగన్ సర్కార్ బాధితులకు పరిహారం ఇచ్చారు కానీ పరిష్కారం మాటేమిటని అడిగారు.  
 
బాధిత గ్రామాల్లోని వాతావరణంలో ఇంకా విషవాయువులు పూర్తిగా తొలగిపోలేదు.  అధికార పార్టీ నేతలు పరిసర ప్రాంతాల్లో ఒక రాత్రి బస చేసి ఎలాంటి భయంలేదని గ్రామస్తులకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినా ఆ తర్వాత సర్వేకు వెళ్లిన వాలంటీర్లు అస్వస్థతకు గురికావడం, పునరావాస కేంద్రాల నుండి ఇంటికి వెళ్లిన గ్రామస్తులు సైతం ఇబ్బందులు పడటంతో అక్కడి వాతావరణంలో  ఇంకా స్టైరిన్ ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది.  నిపుణులు సైతం అక్కడి గాలి, నీరు, చెట్లు గ్యాస్ రహితం కావడానికి ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు.  
 
కానీ సర్కార్ మాత్రం పునరావాసంలో ఉన్నవారిని తరలించేస్తున్నారు.  ఆసుపత్రులు సైతం భాధితులకు ట్రీట్మెంట్ పూర్తైంది అంటూ డిశ్చార్జ్ చేసి పంపివేస్తున్నారు.  కానీ గ్రామస్తులు మాత్రం ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండలేక పోతున్నామని వాపోతున్నారు.  అయినా నాయకులు ఒక్కరోజు నిద్ర చేసి ఇక జీవితాంతం అక్కడ ఉండొచ్చని చెప్పడం ఏమంత వివేకం అనిపించుకోదు.  ఇవన్నీ కాకుండా అసలు ఇంత విపత్తుకు కారణమైన ఫ్యాక్టరీని అక్కడి నుండి తరలించే ఏర్పాటు ఎందుకు చేయడం లేదు, నిర్లక్ష్యంతో వ్యవహరించిన యాజమాన్యంపై సత్వర చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటున్నారు భాధితులు. 
 
వారడుగుతున్న ఈ ప్రశ్నల్లో నూటికి నూరు శాతం న్యాయం ఉంది.  అందుకే పవన్ వారి తరపున ప్రశ్నిస్తున్నారు.  అంతేకాదు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  వాటి మీద కూడా సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.  ఇదే ప్రశ్నల్ని లేవనెత్తిన చంద్రబాబుపై ఆయన పాలనలోని వైఫల్యాలను ఎత్తి చూపుతూ వ్యంగ్యమైన కౌంటర్లు వేస్తున్న వైకాపా నేతలు ఇప్పుడు పవన్ ప్రశ్నలకైనా సరైన సమాధానం ఇస్తారో లేకపోతే ఎప్పటిలాగే పవన్ చంద్రబాబుకు బీటీమ్ అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తారో చూడాలి.