ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో, సమావేశాలలో ఏపీ సీఎం తనయుడు, మంత్రి లోకేష్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాడు. అయితే సీఎంని, పార్టీలోని కీలక నేతలను వదిలి కేవలం లోకేష్ నే పవన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే చర్చ అందరిలో మొదలైంది.
టీడీపీలో కీలకంగా ఉన్న నేతలందరికీ లోకేష్ పార్టీలోకి వచ్చాక వాళ్ల ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో వారంతా అసహనంగా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ మంత్రి అయ్యాక చంద్రబాబు తర్వాత ఆయనే అన్నట్టుగా ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ నడుస్తుంది. కేవలం ముఖ్యమంత్రి కొడుకు అన్న అర్హతతో నిన్న మొన్న వచ్చిన ఆయనకు ప్రాధాన్యత పెరగడం, పార్టీ స్థాపించినప్పటీ నుంచి ఉన్న తమకు విలువ లేక పోవడంతో తెలుగుదేశం నేతలే పవన్‌తో లోకేష్ పై విమర్శలు చేయిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు, హీరో చిరంజివికి మంచి మిత్రుడు. ఆయన తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలు, ప్రభుత్వ విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు చిరంజీవి, పవన్‌తో చర్చిస్తున్నారని తెలుస్తుంది. తమ గోడును పవన్ వద్ద వినిపించినట్టు దాంతో పవన్ లోకేష్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడని పలువురు అంటున్నారు.
ఇక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా లోకేష్ వ్యవహారంపై గుర్రుగానే ఉన్నారు. లోకేష్ పార్టీలోకి రాకముందు ఆ మంత్రిది చంద్రబాబు తర్వాత స్థానం ఉండేది. లోకేష్ ఎంటర్ అయిన తర్వాత తన ప్రాధాన్యత తగ్గిపోవటంతో ఆ మంత్రి అసహనంగా ఉన్నాడు. ఈయన కూడా పవన్ తో ఉన్న పాత పరిచయంతో నిత్యం టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది.
ముందుగా వీరిద్దరు వైఎస్ జగన్‌తో చెప్పి విమర్శలు చేయించాలని భావించారట. కానీ జగన్ చేసిన విమర్శలన్నింటినీ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలుగా భావించి కొట్టిపడేస్తారని భావించారట. దాంతో పవన్ అయితే పార్టీకి పాతస్నేహితుడు. విమర్శలు చేస్తే ఇన్నాళ్లు కలిసి ఉన్నాడు కాబట్టి అవన్నీ నిజమే అని నమ్మే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతోనే పవన్ తో విమర్శలు చేయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
వీరే కాదు.. మరికొంత మంది నేతలు కూడా లోకేష్ పై అలకతో ఉన్నారట. సీఎం కొడుకు కావటంతో ఇతర నేతలు, అధికారులు కూడా లోకేష్ చెప్పినట్టే వ్యవహరిస్తున్నారని, తమను పట్టించుకోవటం లేదని తమను రబ్బరు స్టాంపు చేశారనే భావనలో ఆ నేతలు ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి లోకేష్ రాకముందు చాలా మంది నేతలు కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆ నేతలను ప్రధానంగా చేస్తే లోకేష్ పేరు మరుగున పడి..లోకేష్ ఇమేజ్ ప్రజల్లో, పార్టీలో, ప్రభుత్వంలో తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో లోకేష్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధినేత భావించారేమో అన్న చర్చ జరుగుతుంది. అందుకే టీడీపీలో ఉన్న అసంతృప్తులే లోకేష్ పై పూర్తి సమాచారాన్ని పవన్ కు అందించి లోకేష్ ను టార్గెట్ గా విమర్శలు చేయిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది..