నైరుతి రుతుపవనాలతో రైతులకు శుభసూచికం !

దేశంలోకి రుతుపవనాల రాకతో  చల్లని చిరుజల్లులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఎండలతో సతమతమైన ప్రజలు వర్షాలు, చల్లని గాలులకు హాయిగా సేదతీరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండ్రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు  రాష్ట్రాల్లో రానున్న మూడురోజులు ఉరుములు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని  వాతావరణ కేంద్రం వెల్లడించింది.
 
 
ముందుగా తెలంగాణ విషయానికి వస్తే  హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. అదేవిధంగా  యాదాద్రి, వికారాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూలు  జిల్లాల్లో కూడా  చిరుజల్లులు కురిసే అవకాశం ఉందట. ఇక ఏపీలోనూ రాబోయే 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువ చోట్ల, కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.  ఉత్తర కోస్తాలో  కూడా ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయట. 
 
 
ఈ వర్షాలు రైతులకు దేశ వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాల వల్ల పడనున్నాయి.  నిన్న  సాయంత్రం నుండే అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో  తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా  చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రైతులు పంటలు వేసే అవకాశం ఉన్న ఈ నెలలో ఇలా  వర్షాలు పడటం శుభసూచికం అనే అనుకోవాలి.