నీ విరాళం వద్దుపో..!? చిత్తూరు జిల్లాలో రాజకీయాల పర్యవసానం!

ఇప్పుడు జరుగుతోంది ఎన్నికలు కాదు, గెలుపు ఓటముల ఆరాటం కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య సిబ్బంది.. పోలీసులు ఇలా ప్రతి ఒక్కరు చేస్తోన్న పోరాటం. ఈ పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు.. సహృదయాన్ని చాటుకునేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. అయితే ఈ సాయంలో కూడా రాజకీయ పర్యవసానాలు చూడటం.. వద్దుపో అంటూ వెనక్కి పంపడం విస్మయానికి గురిచేస్తోంది.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం.. పారిశ్రామిక వేత్త బోడే రామచంద్రయాదవ్… పోలీసు, వైద్య పారిశుద్య సిబ్బందికి రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు వంటివి కూడా అందజేస్తామని తెలిపారు. అయితే దీనిపై ముందుగా అధికారులు సరే అన్నా.. ఆ తర్వాత మాత్రం రాజకీయం రంగప్రవేశం చేసి.. నీ సాయం మాకు వద్దు.. మేము నిన్ను అడిగామా అంటూ చీత్కరించినట్లు తెలుస్తోంది. పైగా కింది స్థాయి అధికారులకు సైతం ఆయన నుండి ఎలాంటి సాయం తీసుకోవద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయట. ఇలా ఎందుకు అంటే.. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరపున పోటీ చేయడమే కారణం అని తెలుస్తోంది. అందువల్లే అధికార పార్టీకి చెందిన వారు ఆయన నుండి విరాళం తీసుకోవద్దని హెచ్చరించారని, అందుకే అధికారులు ఇలా ప్రవర్తించారని టాక్ వినబడుతోంది.

అధికారులు తిరస్కరించే సరికి నేరుగా ప్రజలకే అందించాలని రామచంద్ర యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇదే గనుక నిజం అయితే.. ప్రభుత్వానికే కాదు.. ప్రభుత్వ అధికారులకు కూడా చెడ్డ పేరే వస్తుంది. రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేయాల్సిన వారు ఇలాంటి చర్యలకు దిగితే ఆ ప్రభావం ప్రభుత్వం మీద కూడా పడుతుంది అని గ్రహించాలి. దీనిపై చర్యలు తీసుకోవాలి.