నితిన్ గడ్కరీ వచ్చింది..మొండి చేయి చూపడానికా?

(కొలనుకొండ శివాజీ)

పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్యలేదంటూనే కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అనేక మెలికలు పెట్టారు. పరోక్షంగా అనుమానాలు వ్యక్త పరిచారు. పోలవరం ప్రాజెక్టు ను చూడ్డానికి ఆయన ఎందుకొచ్చారో కూడా అర్థం కా లేదు. ఆయన వ్యవహార శైలి, పోలవరం ప్రాజెక్టుపై ఆరా తీయడానికి మోడీ గారు పంపిన సీఐడి లాగా ఉంది.

అసలు జాతీయ ¬దా కలిగిన ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సింది కేంద్రపభుత్వమన్న సంగతి ఆయనకు తెలియదా? రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై, అంచనాల పెంపుపై అనుమానాలు, సందేహాలుంటే విచారణ చేయించుకోవచ్చు.. లేదా ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టవచ్చు కదా.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టం అమలు చేయకుండా మోడీ సర్కారు నాటకాలాడుతోంది. ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కాలయాపన చేసేందుకే పదేపదే రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీకి రమ్మంటున్నారు. అభివృద్ధికి రాజకీయాలకు సంబంధం లేదంటూనే రాజకీయం ఎలా ఉంటుందో గడ్కరీ తన మాటల్లోనే చూపించారు… ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చు చేసిన నిధులనే పూర్తిగా ఇవ్వలేదన్న సంగతి ఆయన మరిచారు.. అంచనాల పెంపుపై రాష్ట్రం నివేదికలు పంపి ఏడాది గడుస్తున్నా.. కేంద్రం అనుమానాల నివృత్తికి ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఏడాది క్రితమే పోలవరం నిర్వాసితుల పునరావాసం, పరిహారం కొరకు రాష్ట్రం రూ.33 వేల కోట్లు కావాలని కోరితే గడ్కరీ ఇప్పుడు తీరిగ్గా సందేహాలు వ్యక్తం చేస్తున్నారెందుకని? పోలవరం ప్రాజెక్టు భారతదేశం మొత్తానిది అని గడ్కరీ చెబుతున్నారు.. నిర్వాసితుల పరిహారం, పునరావాసం బాధ్యతను కేంద్రం ఎందుకు తీసుకోదు? ఒక పక్క ముఖ్యమంత్రి పనితీరును పొగుడుతూనే మరో పక్క అనుమానాలు వ్యక్తం చేయడం గడ్కరీకే చెల్లింది.

2010-11 నాటి అంచనాల ప్రకారం రూ.16వేల కోట్లు మాత్రమే నాబార్డు ద్వారా సమకూరుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఏనాడో స్పష్టం చేశారు.. ఇప్పుడు నిధుల కోసం ఆర్థికశాఖను ఒప్పించుకోండి అని చెప్పడానికా గడ్కరీ ఇక్కడకు వచ్చింది? జరుగుతున్న పరిణామాలను బట్టి పోలవరం ప్రాజెక్టు మోడీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. రాష్ట్రానికి చేయాల్సినవన్నీ చేస్తున్నాం అని చెబుతున్న రాష్ట్ర బీజేపీ నాయకులు దీనిపై నోరు మెదపరేం?

మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరంపై వాస్తవాలు వెల్లడించడం లేదు.. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆరాటంతో మరో 2019 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను వంచిస్తున్నారు. ఇప్పటివరకు 50శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయని ప్రభుత్వమే చెబుతోంది… మిగతా పనులు మరో ఏడాదిన్నరలోనే పూర్తి చేయడం సాధ్యమా?

టీడీపీ నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగిన ఫలితంగానే పోలవరం సహా రాష్ట్ర హక్కులను, ఆస్తులను సాధించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌తోనే ఆంధ్రప్రదేశ్‌ కు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఐదుకోట్లమంది ఆంధ్రులు గ్రహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యం… రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన చట్టం పక్కాగా అమలు చేయడం తథ్యం.
ఇట్లు :

 

(*కొలనుకొండ శివాజీ, ఏఐసీసీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి)