తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ‘గెడ్డం’ రాజకీయాలు

పురాణాలలో, చరిత్రలో శపథం చేసేందుకు జట్టు ను బాగా వాడుకున్నారు. చాణక్యుడి శపథం మనకు తెలిసిందే.  ద్రౌపది తన ప్రతీకారం తీరేదాకా జుట్టు ముడేసేదే లేదని ప్రతిజ్ఞ చేయడమూ మనకు తెలుసు. ఆ రోజుల్లో ఆడోళ్లు మగోళ్లు ఇద్దరు జుట్టు పెంచుకునేవారు  కాబట్టి ఇలా చేయడం సాధ్యమయింది. ఇపుడు మగవాళ్లకు  జుట్టుఉండదు. ఒక వేళ ఉండినా శపథం చేసే వయసొచ్చేసరికి అది వూడి  బట్టతల రావచ్చు. అందువల్ల జుట్టు శపథాలకు ఇవి  రోజులు కావు.  విదిలించి, కళ్లెర్ర చేసి మరీ శపథం చేసేందుకు జుట్టు మగవాళ్లకు పనికిరాకుండా పోతున్నది.అదువల్ల అల్టర్నేటివ్ వెదుక్కెోవలసి వస్తున్నది. దీనికి గెడ్డం అనువయిందని అన్ని పార్టీల వాళ్లు గ్రహించారు. దీనితో తెలుగు రాష్ట్రాలలో గెడ్డం రాజకీయాలు మొదలయ్యాయి. ఇంతకు మునుపు ప్రాజక్టుల కోసం గెడ్డం పెంచిన వాళ్లున్నారు. వాళ్లెవరూ రాజకీయ పార్టీల వాళ్లు కాదు, కర్నూలు జిల్లాలో గుండ్ల బ్రహ్హేశ్వరం  ప్రాజక్టు వచ్చే దాకా గెడ్డం తీసేది లేదని శివ భాష్యం దాపు  రెండుదశబ్దాలు గెడ్డం పెంచాడు. ఆయన ఇపుడు లేరు. ప్రాజక్టు కార్యరూపం దాల్చింది. ఒక మహర్షిలాగా బతికిన శివ భాష్యం పేరే ఆ ప్రాజక్టుకు పెట్టారు. ఇలాగే తెలంగాణాలో జలదీక్షలపేరుతో దుశ్చర్ల సత్యనారాయణ గెడ్డం పెంచాడు. ఎన్నో ప్రాజక్టులు కార్యరూపం దాల్చేందుకు ఆయనేకారణం. వీళ్లు పార్టీలా కు అతీతంగా గెడ్డంపెంచారు. అయితే, ఇపుడు గెడ్డం రాజకీయ ఆయుధం అయింది. మరొక వైపు  ఇలా గెడ్డాన్ని రాజకీయాలకు వాడుకోవడం గిట్టని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లంతా గెడ్డం  రాజకీయాలను వెటకారం చేయడం కూడా జరుగుతూ ఉంది.

 మొన్నా మధ్య  తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెడ్డం బాగా వివాదాస్పదమయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఎలాగైనా సరే  2019ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను గద్దె దించుతానని గెడ్డం మీద ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నానని  ఇలా వూరికే చెబితే నమ్మరుకాబట్టి, ఆయన ఏకంగా ఇలా  గెడ్డం ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే దాకా తానసలు  గెడ్డం తీసేసే ప్రసక్తే లేదుపొమ్మన్నారు. ఉత్తం ఎయిర్ ఫోర్స్ నుంచి రాజకీాయల్లోకి వచ్చిన వ్యక్తి.  చాలా డిసిప్లిన్డ్ గా కనిపించడం, దుస్తులేసుకోవడం, నీట్ గా గెడ్డం గీక్కోవడం ఆయన అలవాటు.

అలాంటి వ్యక్తి ఇపుడు రాజకీయ లక్ష్యం కోసం గెడ్డం పెంచి ముందుకెళ్తున్నారు. గెడ్డం ప్రతిజ్ఞతర్వాత ఆయన కార్యక్రమాలు ఉధ‌ృతమయ్యాయి. ఆయన్ని తీసేసి మరొక వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా  నియమించాలన్న క్యాంపెయిన్ చల్లారిపోయింది.  ఆయన వ్యతిరేకలందరి నోర్లను కాంగ్రెస్ మూయించింది, వచ్చే ఎన్నికల దాకా ఆయనే పిసిసి అధ్యక్షుడని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు గాని, గెడ్డం ప్రతిజ్ఞ తర్వాత కాంగ్రెస్ లో వాతావారణం ఆయనకు అనుకూలంగా మారింది.అయితే,  ఉత్తమ్ గెడ్డం మీద  రూలింగ్ పార్టీ వోళ్లు మాత్రం తెగ జోక్స్ పేల్చారు. మంత్రి కెటిఆర్ కూడా ట్వీటెక్కారు. ఇలా గెడ్డం ప్రతిజ్ఞను హేళన చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ వాళ్లు ఎదురు తిరిగాక ఈ సద్దమణిగింది. ఉత్తమ్ గెడ్డానికిపుడు 10 నెలలు.

సిఎం రమేష్ గెడ్డం ప్రతిజ్ఞ

ఈరోజు ఆంధ్రలో మరొక ప్రముఖ నాయకుడు గెడ్డం మీద ప్రతిజ్ఞ చేశారు. ఆయనెవరో కాదు, ఈ మధ్యనే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష  చేసిన విరమించిన టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్.  సోమవారం ఉదయం ఆయన తిరుమలలో గెడ్డం ప్రతిజ్ఞ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన రాయి అదే పునాది రాయి పడేదాకా తాను గెడ్డం గీకేదేలేదని ప్రకటించారు. ఈరోజు ఆయన పొద్దునే విఐపిదర్శనం చేసుకున్నారు. అప్పటి కే ఆయనకు గెడ్డం పెరిగి ఉంది.   ఈ గెడ్డం చూపిస్తూ ఇది తన దీక్ష పర్యవసానం అన్నారు. తాను నాటి దీక్ష విరమించలేదని, ఘనపదార్ధాలు తీసుకోవడం  లేదని, కేవలం ద్రవాల మీద బతుకుతున్నాని చెబుతూ ఇది దీక్షను కొనసాగిస్తున్నట్లే నని ఆయన వాదించారు. పదకొండు రోజుల దీక్ష తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశాక ఆయన ఇంకా ఘనాహారం తీసుకోవడం లేదట.‘ రెండు నెలల్లో కేంద్రం నుంచి కడప ఉక్కు మీద ప్రకటన రావాలి. అలా కాని పక్షం  రాష్ట్రం  50 :50శాతం ఈక్విటీ నిష్పత్తిలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తుందని కేంద్రానికి తెలియ చేస్తాం. అదీ కాకపోతే, రాష్ట్రమే స్వయంగా  ప్లాంట్ ఏర్పాటుచేస్తుంది.  ఏది ఏమయినా స్టీల్ ప్లాంట్ కు పునాది రాయి పడేదాకా గెడ్డం తీసేసి లేదని ఆయన ఖరాకండిగా చెప్పారు.