తెలుగు తమ్ముళ్లకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ (వీడియో)

టీడీపీ నాయకులకు జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టి కౌంటరిచ్చారు. జనసేన కార్యకర్తలపై, సైనికులపై భౌతిక దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా, చాలా బలంగా ఉంటాయని ఆయన టీడీపీని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నామని, అటువంటి తమ పై దాడులు చేస్తే ఏ ఒక్కరినీ వదిలేది లేదని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించి గెలుపులో తమ వంతు పాత్ర పోషించామనే భావనలో పవన్ ఉన్నారు. అటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసమస్యలను గాలికొదిలేసి అధికార దర్పం చూపిస్తుందని జనసేనాని అభిప్రాయం. 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న పవన్ 2016 నుంచి క్రియాశీలక బాధ్యతలు పోషిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం గ్రామస్థుల కిడ్నీ సమస్యతో పవన్ ప్రభుత్వం పై యుద్దభేరి మోగించారు. ఉద్దానం గ్రామస్థులు కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు. పవన్ ఆందోళనతో దిగి వచ్చిన ప్రభుత్వం ఉద్దానం గ్రామస్థులకు వైద్య సౌకర్యాలు కల్సించడమే కాకుండా వారి కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పోలవరం ముంపు గ్రామాలకు, రైతులకు నష్టపరిహారం పై కూడా పవన్ ప్రజల పక్షాన పోరాడారు. ప్రత్యేక హోదా కోసం పవన్ తీవ్రమైన ఉద్యమాలే చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు హోదా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. మేధావులతో, అన్ని ప్రజాసంఘాలతో తరచూ సమావేశమవుతూ హోదా నినాదాన్ని ప్రజలందరిలోకి బలంగా తీసుకెళ్లడంలో పవన్ కృషి చేశారనే చెప్పవచ్చు. వామపక్ష నాయకులతో నిత్యం సమీక్షలు నిర్వహించి ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చారు పవన్ . ప్రత్యేక హోదా కోసం పవన్ చేస్తున్న ఉద్యమంతో టీడీపీ ఏకంగా కేంద్ర ప్రభుత్వంతోనే తెగదెంపులు చేసుకుంది. ఈ మధ్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగిన ఓ దేవాలయ కార్యక్రమంలో పవన్, చంద్రబాబు ఇద్దరూ పాల్గొన్నా కనీసం ఒకరికొకరు పలకరించుకోకుండా ఏడామొహం , పెడమొహం ల వ్యవహరించారు. ఈ సీనుతో పవన్, బాబుల మధ్య బంధం తెగిపోయిందని చాలా స్పష్టంగా కనబడింది. ఎంత శత్రుత్వం ఉన్నా ఎదురుపడినప్పుడు కనీసం పలకరించుకోవడం మర్యాద అని అటువంటిది వారు పంతానికి పోయి వారి హోదాలను అవమానపరుచుకున్నారని విపక్షాలు విమర్శించాయి.

ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో జనసేనాని కార్యకర్తలపై అధికార టీడీపీ వాళ్లు దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుండటంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని పవన్ చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల మధ్య పంతం ఎంత వరకు దారి తీస్తుందో ఇది ఎప్పుడు అంతం అవుతుందో , ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని అంతా చర్చించుకుంటున్నారు.

 

[youtube https://www.youtube.com/watch?v=kqijuF89s3A]