తప్పుడు ఆరోపణలతో మనసు క్షోభిస్తోందట

దొంగతనం కేసులో అడ్డంగా దొరికిపోయినా అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంకా అడ్డదిడ్డంగానే మాట్లాడుతున్నారు. దొంగతనం కేసు బయటపడిన తర్వాత సిగ్గు పడాల్సింది పోయి ఇంకా బుకాయిస్తునే ఉన్నారు. తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. తప్పుడు ఆరోపణలతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు అందులో చెప్పటమే విచిత్రంగా ఉంది.

హైదరాబాద్ నుండి అమరావతికి  మారేటపుడు తనకు తెలీకుండానే సెక్యురిటి సిబ్బంది తన ఇంటికి, క్యాంపు ఆఫీసుకు ఫర్నీచర్ ను తరలించారని అబద్ధాలు చెబుతున్నారు. అసెంబ్లీ నుండి సెక్యురిటి సిబ్బంది ఫర్నీచర్ ను తరలించారని స్పష్టమైంది. ఫర్నీచర్ ను తరలించేటపుడు ఎవరికీ పట్టుబడకుండా సిసిటివిలను ఆపుచేసి మరీ బయటకు పంపించినట్లు  అర్ధమైపోయింది.

పోని భద్రతా సిబ్బంది తన ఇంటికి, క్యాంపు కార్యాలయానికి ఫర్నీచర్ తరలించింది నిజమే అని అనుకున్నా గుర్తించిన తర్వాతైనా కోడెల ఫర్నీచర్ మొత్తాన్ని తిరిగి అసెంబ్లీకి చేర్చేయాలి కదా ? ఎందుకు చేర్చలేదు ? కోడెల చెబుతున్నట్లు ఇల్లు, క్యాంపు కార్యాలయానికి ఫర్నీచర్ తరలించింది వాస్తవమే అనుకున్నా మరి కొడుకుకు చెందిన షో రూములో ఎందుకు పట్టుబడింది ?

ఇక్కడ విషయం ఏమిటంటే దొంగతనం కేసులో పట్టుబడ్డ కోడెలకు ఉన్న కొద్దొగొప్పో పరువు కూడా పోయింది. జనాలు, పార్టీ నేతలు ఛీ కొడుతున్నారు. ఎటువైపు నుండి తనకు మద్దతు దొరకటం లేదు. గుండెనొప్పి అంటూ ఆసుపత్రిలో చేరింది కూడా డ్రామాలే అంటు జనాలు చెప్పుకుంటున్నారు. ఇలా ఎటు చూసినా ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. దాంతో సిగ్గుతో తలొంచుకోకుండా ఇంకా ఎదురుదాడితో బుకాయించటమే విచిత్రంగా ఉంది.