తండ్రి ప్రారంభించిన పోలవరాన్ని జగన్ పూర్తి చెయ్యగలరా?

 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించి ప్రాజెక్టు పూర్తి కావడానికి వరాల జల్లులు కురిపించారు. ముఖ్యమంత్రి సూచనలు అమలు జరిగితే నిర్ణీత గడువు లోపల ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అయితే ఇందుకు సవాలక్ష సమస్యలున్నాయి. కేంద్ర జలసంఘానికి చెందిన నిపుణుల కమిటీ ఇటీవల వచ్చినపుడు సాంకేతికంగా పలు సూచనలు చేసింది. నిపుణుల కమిటీ వేసిన ప్రశ్నలకు ప్రాజెక్టు అధికారులు నీళ్లు నమిలారు.ఎగువ కాపర్ డ్యాంలో వున్న గ్యాప్ లను పూర్తి చేస్తే గాని ప్రధాన మైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాము పనులు నిరాఘాటంగా కొనసాగించడం కుదరదు. కాబట్టి అందుకు అనుమతి కోరారు. నిపుణులు బృందం అంగీకరించలేదు. కాఫర్ డ్యాం గ్యాప్ లు పూర్తి చేసే ముందు వరద రోజుల్లో ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి ఆర్ అండ్ ఆర్ పథకం పూర్తి చేయాలని లేకుంటే తీవ్ర ఇబ్బందులు వుంటాయని సూచించింది.అంతే కాకుండా కుడి ఎడమ కాలువలకు కనెక్టివిటి పనులు పూర్తి కావాలని లేకుంటే నిల్వ వుండే నీరు ఏలా వుపయోగిస్తారని నిలదీశారు. నీటి వినియోగానికి ఆయకట్టుతో పాటు పంటకాలువలు ఏర్పాటు జరగాలని సూచించారు.

అదే సమయంలో స్పిల్ వే పూర్తి చేయడం 48 గేట్లు బిగించడంతో పాటు స్పివే ఛానల్ పూర్తి అయిన తర్వాతనే కాఫర్ గ్యాప్ లు పూర్తి చేయాలని సూచించింది.ఈ లోపు 48 గేట్లు బిగించడం సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. కాపర్ డ్యాం గ్యాప్ లు పూర్తి చేస్తే 41.15 మీటర్ల ఎత్తుకు వరద నీరు చేరుతుందని అందుకు చెంది ఆర్ అండ్ ఆర్ పథకం పూర్తికి అయిదారు వేల కోట్ల రూపాయలు అవసరమౌతుందని ఒక వేళ నిధులు ఒన కూడినా రేపు వరద వచ్చే లోపు పునరావాస పనులు పూర్తి అయ్యే అవకాశం లేదని నిపుణులు తేల్చి వెళ్లారు.అయితే శుక్రవారం పోలవరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనలకు అధికారులు అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం 55 వేల కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నది. ఇందులో ముంపు బాధితులకు ఆర్ ఆర్ పథకానికే 30 వేల కోట్లుఅవసరముంది. కనీసం కాఫర్ డ్యాం నిర్మాణం వరకు ఆర్ అండ్ ఆర్ పథకానికి ఆరేడు వేల కోట్ల రూపాయలు కావాలి.

గతంలోనే ఈ ఏడు పదివేల కోట్లు ఇవ్వమని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. కేంద్రం ముష్టిగా 1800 కోట్లు విడుదల చేసి ఇప్పటి వరకు తను ఇచ్చిన ఎనిమిది వేల కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తం నిధులకు ఆడిట్ చేసి పంపితే తర్వాత నిధులు విడుదల చేస్తామని ఖరాఖండిగా చట్ట సభలో చెప్పారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శుక్రవారం పోలవరం సందర్శించి వరాల జల్లలు కురిపించి ఎట్టి పరిస్థితుల్లోనూ 2021 జూన్ కల్లా ప్రాజెక్టు పూర్తి కావాలని ఈ ఏడు జూన్ నాటికి కాపర్ డ్యాం గ్యాప్ లు స్పిల్ వే గేట్లు బిగించడంతో పాటు స్పిల్ వే ఛానల్ పూర్తి చేయాలని ఆదేశించారు. అంత వరకు బాగానే వుంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలంటే వచ్చే జూన్ నాటికి పదివేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సమకూర్చితే గాని వీలుకాదు. ఆర్ అండ్ ఆర్ కు మాత్రమే అయిదారు వేల కోట్లు కావాలి. అంత మేరకు ముఖ్యమంత్రి నిధులు సమకూర్చ గలరా? పైగా రేపు జూన్ నాటికి దాదాపు 17 వేల కుటుంబాలకు పునరావాసం నిర్మాణం పూర్తి చేయ గలరా? అందుకే నిపుణుల కమిటీ పలు సందేహాలు వ్యక్తం చేసి పునరావాసం పూర్తి చేసిన తర్వాతనే కాపర్ డ్యాం గ్యాప్ లు పూర్తి చేయమని సూచనలు ఇచ్చి వెళ్లింది. ఇందుకు చెంది ప్రాజెక్టు అధికారులు ఇచ్చిన హామీలు వివరణలు నిపుణుల కమిటీ అప్పట్లో అంగీకరించ లేదు.