ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు అధికారులే నిలబడవలసి వుంటుంది. వాస్తవంలో తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించిన దృష్టాంతరాలు ఎన్నో వున్నాయి

ప్రస్తుతానికొస్తే ఈశాన్య ఢిల్లీ అల్లర్ల గురించి బుధ గురు వారాల్లో ఢిల్లీ హైకోర్టు పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండ గట్టింది. సమాధానం చెప్పుకోలేక పోలీసు అధికారులు సతమతమయ్యారు.

సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గురువారం పోలీసుల చేత గాని బయట పడింది. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు అనుమతి ఇచ్చి అల్లరి చేసే వారిని అదుపు చేయ లేక తుదకు చంద్రబాబు నాయుడు నే అరెస్టు చేసి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. అటు ఢిల్లీ ఇటు వైజాగ్ లో పాలక వర్గాల కనుసన్నల్లో వ్యవహరించినందున ఢిల్లీ హైకోర్టు ఛీవాట్లు ఈపాటికే పోలీసులు తింటే మున్ముందు విశాఖ పోలీసులు ఇదో పరిస్థితి ఎదుర్కోవలసి వుంటుందేమో.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధరన్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన నలుగురు బిజెపి నేతలపై కేసులు నమోదు చేయాలని బుధవారం ఆదేశాలు చేశారు. వాళ్ళ ప్రసంగాలు సాక్షాత్తు కోర్టులో వినిపించారు. కాని బుధవారం అర్ధరాత్రి న్యాయమూర్తి మురళీధర్ కేంద్రం బదలీ చేసింది. అయితే గురువారం కేసు విచారించిన చీఫ్ జస్టిస్ ఇదే అంశంపై ఢిల్లీ పోలీసులను నిలదీశారు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మలినం కాకుండా వుండ బట్టే కొంత మేరకైనా సామాజిక న్యాయం ప్రాణంతో వుంది.

ఇదిలా వుండగా గురువారం విశాఖ పట్నంలో పోలీసు అధికారులు శైలి వివాదాస్పదమైంది. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తెచ్చిన తర్వాత అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో ప్రాంతీయ భావోద్వేగాలు తీవ్రంగా వున్నాయి. ఈ భావోద్వేగం సాధారణ ప్రజల్లో ఎంత వరకు వుందో అది పక్కన బెడితే రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈ ఉచ్చులో చిక్కుకున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజాచైతన్య యాత్ర సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనకు అనుమతి కోరినపుడు స్థానిక ప్రజలను కావచ్చు లేదా వైసిపి కార్యకర్తలను కావచ్చు అదుపు చేయలేమని భావించినపుడు అసలే అనుమతి ఇచ్చి వుండకూడదు. ఒక వేళ అనుమతి ఇచ్చినపుడు మొన్నటి వరకు ముఖ్యమంత్రి గా వున్న నేత పర్యటన సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఒక వేపు టిడిపి నేతలు కార్యకర్తలను పరిమితం చేసి మరో వేపు వైసిపి కార్యకర్తలను అసంఖ్యాకంగా ఎయిర్ పోర్ట్ లోనికి అనుమతించి తీరా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత శాంతి భద్రతల సమస్య తీసుకు వచ్చి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడమంటే అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు అధికారులు వ్యవహరించారని భావించేందుకూ ఆస్కారమేర్పడింది. అందుకే చంద్రబాబు నాయుడు రాతపూర్వకంగా తీసుకొని అరెస్టు అయ్యారు. ఇందుకు విశాఖ పోలీసు అధికారులు రేపు కోర్టుకు సమాధానం చెప్పుకోవలసిన వుంటుంది.

గమనార్హమైన అంశమేమంటే అటు ఢిల్లీ సంఘటనలకు ఇటు విశాఖ పరిణామాలకు వెనుక అధికార పార్టీలు వున్నా లేకున్నా వారు కోర్టు మెట్లు ఎక్కరు. గాని తమ విధులు సరిగా నిర్వహించనందుకు భారత దేశంలో ఒకే ఒక ఆశాకిరణంగా వున్న న్యాయ వ్యవస్థ ముందు పోలీసులు నిలబడిలసి వస్తోంది