డిప్యూటీ సీఎం కుటుంబానికే జగన్ పాలన నచ్చేలేదు  

అధికార ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం కామన్.  సర్కార్ ఎంత చేసినా ప్రత్యర్థులు లోపాల్ని ఎత్తి చూపుతూనే ఉంటారు.  ఇవి జనాలకు కూడా సర్వసాధారణం అయిపోయాయి.  కానీ అధికార పక్షంలోని నేతలే అభివృద్ది జరగడంలేదని వాపోతే.. ప్రజలు సైతం విస్తుపోతారు.  ప్రజెంట్ ఈ పరిస్థితి వైకాపాలో నెలకొంది.  ఏదో ఒకరో ఇద్దరో నేతలు అలా అంటే పదవులు దక్కలేదనే ఆక్రోశం అనుకోవచ్చు.  కానీ ఆ సంఖ్య పెరిగితే ఏదో తేడా జరుగుతుందని స్పష్టమవుతోంది.  ఏకంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కుటుంభమే తమ నియోజకవర్గంలో అభివృద్ది శూన్యమని విమర్శలు చేయడం సంచలనానికి దారితీసింది. 

 
పుష్పశ్రీవాణి మామగారు శత్రుచర్ల చంద్రశేఖరరాజు తమ నియోజకవర్గమైన కురుపాంలో ఇన్నేళ్లు గడిచినా డెవలెప్మెంట్ లేదని మీటింగ్ పెట్టి మరీ చెప్పారు.  జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం ఉన్నా ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని, వైఎస్ జగన్ పాలనలో అభివృద్ది కుంటుపడిందని విమర్శలు గుప్పించారు.  నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందన్నారు.  అంతేకాదు అర్హులైన వారు వైసీపీకి మద్దతుగా లేకపోతే వారికి పెన్షన్లు అందడంలేదని కంప్లైంట్ చేశారు.  
 
అంతేకాదు సంక్షేమం అంటే డబ్బులు పంచిపెట్టడం కాదని శాశ్వత కార్యక్రమాలు చేయాలని, జగన్ పాలనలో కంటే వైఎస్ హయాంలో పాలన బాగుండేదని చెప్పుకొచ్చారు.  ఈ వ్యాఖ్యలు చేసింది మామూలు వ్యక్తి కాదు.. మాజీ ఎమ్మెల్యే,  రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి.  అందుకే ఆయన విమర్శలు పార్టీలో కలకలం రేపాయి.  ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని నేతల్లో అసంతృప్తి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే, నరసాపురం ఎంపీ కూడా ఇదివరకే అసంతృప్తి వ్యక్తం చేశారు.  
 
ఇలా ఒకరి తరువాత ఒకరు అసంతృప్తి చెందడం వెనుక వారి వారి నియోజకవర్గాల్లో వారిపై వస్తున్న ఒత్తిడే కారణం కావొచ్చు.  వివిధ సంక్షేమ పథకాల పేరిట ఆర్థిక లబ్ది పొందుతున్న లక్షలాది మంది వైఎస్ జగన్ పాలన భేష్ అంటూ ఒక ప్రముఖ సర్వేలో ఆయన్ను మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానంలో నిలబెడితే సొంత నేతలు మాత్రం సంక్షేమం సరే అభివృద్ది మాటేమిటని అంటుండటాన్ని జగన్ నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించి తీరాలి.