డాక్టర్ సుధాకర్ చుట్టూ ఎందుకింత రాజకీయం ?

Vizag Doctor Sudhakar
వైద్యులకు మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడంలేదని ఆరోపణలు చేసిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మత్తు వైద్యుడు సుధాకర్ విధుల నుండి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.  ఆయన్ను విధుల నుండి తీసేయడం పట్ల అప్పట్లోనే రాజకీయ నాయకులు పెద్ద దుమారం రేపాలని అనుకున్నారు.  కానీ అంతకంటే హాట్ టాపిక్స్ వేరే ఉండటంతో పట్టించుకోలేదు.  తాజాగా శనివారం సుధాకర్ రోడ్ల మీద ప్రత్యక్షం కావడంతో దుమారం మొదలైంది.  సుధాకర్ రోడ్ల మీద హాల్ చల్ చేస్తున్నారని స్థానికుల నుండి కంప్లైంట్ వెళ్లడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు.  
 
పోలీసులు చేరుకునేసరికి సుధాకర్ చొక్కా విప్పి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతూ కనిపించారు.  దీంతో పోలీసులు కాస్త ఓవర్ చేశారు.  వైద్యుడిని మామూలుగా డీల్ చేయకుండా ఏదో వాంటెడ్ క్రిమినల్ కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అలా అయ్యారు.  చేతులు వెనక్కి విరిచి, తాళ్లతో కట్టేసి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు.  దీంతో సుధాకర్ పోలీసులు, ప్రభుత్వం తనను చంపాలని చూస్తున్నట్టు వాపోయారు.  ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.  దీంతో ప్రతిపక్షం టీడీపీ తన పని తాను స్టార్ట్ చేసింది.  
 
చంద్రబాబు, లోకేష్ సహా తెలుగు దేశం నేతలందరూ ఒక దళిత వైద్యుడి పట్ల జగన్ సర్కార్ అమానుషంగా వ్యవహరిస్తోందని విమర్శలు స్టార్ట్ చేశారు.  దీంతో వ్యవహారానికి కులం రంగు కూడా అంటుకుంది.  అసలు పోలీసులు సుధాకర్ పట్ల సున్నితంగా వ్యవహరించి ఉంటే విషయం ఇక్కడి వరకు వచ్చేది కాదు.  అతను మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానం ఉందన్న పోలీసులు అతన్ని నిదానంగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోయి ఉండాల్సింది.  కానీ ఆయన్ను కొంచెం కర్కశంగా డీల్ చేశారు.  ఇక దొరికిందే తడవని ప్రతిపక్షం గోల స్టార్ట్ చేసింది.  ఎప్పటిలాగే మీడియా రెండుగా చీలిపోయి ఎవరి వర్గాన్ని వారు సపోర్ట్ చేస్తూ విషయాన్ని పెద్దది చేశారు.  
 
గోటితో పోయే ఈ విషయాన్ని పోలీసులు, రాజకీయ నాయకులు, మీడియా అందరూ అత్యుత్సాహంతో గొడ్డలి వరకూ తెచ్చారు.  చివరికి వైద్యుడికి మానసిక సమస్య ఉందని నిర్థారించి ఆసుపత్రికి తరలించారు.  ఇకనైనా పోలీసులు, నేతలు విషయాన్ని లైట్ తీసుకుని అతనికి కావాల్సిన వైద్యం సాయం అందించి బాగయ్యాక వీలైతే తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.