వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఊహించని విధంగా తనదైన వ్యూహాలతో, 40 ఇయర్స్ చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు మరోసారి అధికారం తమదేనని భావించిన టీడీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వైసీపీ.. ప్రస్తుతం కొత్త కొత్త ఎత్తులతో టీడీపీని ఇరకాటంలో పెడుతోంది. దీంతో పసుపు దళంకు ఏంచేయాలో అర్ధంకాక చేతులు ముడుచుకుని కాలం గడుపుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తామని, అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఎందుకన్న చంద్రబాబు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. తన పార్టీ నాయకులను నిలబెట్టుకోలేక చంద్రబాబు నానా ప్రయాసలు పడుతున్నారు. అంతే కాకుండా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ప్రస్తుతం ఆ పార్టీని వెంటాడుతున్నాయి. నాడు టీడీపీ నేతలు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ.. జగన్ సర్కార్ వేస్తున్న అడుగులు చంద్రబాబును మరింతగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు, ఆయనకే చెందిన హెరిటేజ్ కంపెనీ నుండి నెయ్యి, పాలు, మజ్జిగ, నీళ్లు వంటివి ఇచ్చి, సొంత అవసరాలకోసం ప్రభుత్వ సొమ్మును గుంజేశారనే ఆరోపణలు ఉన్న నేపధ్యంలో జగన్ సర్కార్ ఏకంగా సీబీఐకి ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చంద్రబాబు అండ్ బ్రదర్స్‌కి తలనొప్పిగా మారింది. ఈ క్రమంతలో పార్టీ పరంగానే కాకుండా చంద్రబాబు కుటుంబాన్ని ఈ వ్యవహారం తీవ్రంగా కలవరపరుస్తుందని రాజకీయవర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతానికి అయితే పార్టీ పరంగా వరుస దెబ్బలు తింటున్న చంద్రబాబు, రాబోయే రోజుల్లో పలు కేసుల రూపంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్న నేపధ్యంలో, సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ తప్ప మిగతావారంతా టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా.. చంద్రబాబు ఇప్పటి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయకుండా, వైసీపీ పై విమర్శలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా మునిగిపోవడం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా జగన్ వ్యూహాల దెబ్బకి చంద్రబాబు చేతులెత్తేశారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.