టీడీపీ కి పునర్జీవం! చంద్రబాబు పర్యటన తోడ్పడనుందా?

మొన్నటి ఎన్నికల్లో టిడిపి కోలుకోలేని విధంగా ఓటమి పాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధికారంలో వున్న ఏ పార్టీ కూడా ఇంత ఘోర మైన ఓటమిని చవి చూడలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డు సృష్టించారని చెప్పాలి. అంతేకాదు. మరో రికార్డు కూడా ముఖ్యమంత్రి స్వతం చేసుకున్నారు. అది విషాదమే.

భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏ ప్రతి పక్ష పార్టీలు కూడా ఒక సంవత్సరం కాలం ఎదిరించి ఉద్యమాలు సాగించిన సందర్భంలేదు.కాని ఆంధ్ర ప్రదేశ్ లో రివర్స్ అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ విధానం అవలంభించుతున్నట్లు తన ప్రభుత్వ పాలసీల్లో కూడా రివర్స్ విధానం అవలంభించడంతో రాష్ట్రంలో మూడు నెలలకే ప్రతి పక్షాలకు చేతి నిండా పని కల్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు తప్పా ఒప్పా అనే అంశం పక్కన బెడితే ఏడెనిమిది నెలల క్రితం చావు దెబ్బ తిన్న తెలుగు దేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఓటమి భయంతో ఇల్లు కదిలే పరిస్థితి లేదు. కాని ఇంతలోనే ఇళ్లు వదలి పెట్టి రోడ్లు మీదకు వచ్చే అవకాశం ఏర్పడిందంటే ఆశ్చర్యమేస్తున్నది. అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రలో బలపడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విధానం ఆ రెండు ప్రాంతాల కన్నా ఎక్కువగా రాజకీయ చైతన్యం వున్న కోస్తా ఆంధ్రలో బలహీన పడ్డారు. అయితే ప్రతి పక్షాలు ఏ మేరకు లాభ పడ్డాయనేది మరి కొన్నాళ్లకు గాని బహిర్గతం కాదు.

వాస్తవంలో ఇంత అనతి కాలంలోనే టిడిపి శ్రేణులు ఓటమి మత్తువదలి వచ్చే అవకాశం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కలిగించారని చెప్పక తప్పదు. తుదకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి విధానాలను బలపర్చే  పార్టీ ఒక్కటి కూడా లేకపోవడమే ఆయన ఒంటెత్తు పోకడకు చిహ్నం.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్య యాత్రపేరుతో 13 జిల్లాలు సాగిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు అమలు చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుకూలించదని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. కాని ఇది సరైన అంచనా కాదు. మగ్గాలు ఆటోలు స్వంతంగా వున్న వారికి ఆర్థిక సాయం చేశారు. బాగానే వుంది. కాని అంతకు రెట్టింపుగా వున్న కూలీకి పని చేసే నేత ఆటో రిక్షా కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. ఇలా చెబితే ఎన్నో అంశాలు వున్నాయి ఆరు లక్షల ఫించన్లు అదనంగా ఇచ్చామని చెబుతూ అయిదు లక్షల మంది ఫించన్లు రద్దు చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు వీరిలో ఎక్కువ మంది అనర్హులు వుండవచ్చు. కాని టిడిపి ప్రభుత్వ హయాంలో చూచి చూడనట్లు పోయే వారని వైసిపి ప్రభుత్వ పాలనలో ఇంత వరకు పొందుతుండిన సబ్సిడీలు రాయితీలు పోతున్నాయనే భావన బలంగా ఏర్పడుతోంది. ఇది ముఖ్యమంత్రికి పెద్ద మైనస్. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడించి తప్పుచేశామనే భావన వైసిపికి ఓట్లువేసిన వారు భావిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతం టిడిపికి బాగా అనుకూలించే అంశాలే. అయితే ఇది ఏమేరకు ప్రజల్లో పాతుకు పోయి వుందో చంద్రబాబు నాయుడు రేపు బుధవారం చేపట్టే పర్యటనలో స్పష్టంగా వ్యక్తమౌతుంది.

రాయలసీమలో టిడిపికి ఇప్పటికీ వ్యతిరేక గాలులు వుండవచ్చు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన పెట్టుకున్న అంచనాలు క్రమేణా తలకిందులు అవుతున్నాయి. రాయలసీమలో రాజధాని లేక హైకోర్టు అనే డిమాండ్ సామాన్య జనంలోనికి ఉద్యమ స్వరూపంలో వెళ్లలేదు. వారికి కావాల్సింది నీళ్లు. సంవత్సరం గడచిపోయింది. ఇంకొక సంవత్సరం ఇదే పరిస్థితి వుంటే అంచనాలు తలకిందులౌతాయి. ఆ పరిస్థితిలో రాయలసీమ ప్రజల మైండ్సెట్ ఎట్లుందో ఇప్పుడే చెప్పులేము. అయితే చంద్రబాబు నాయుడు రాయలసీమ లో కూడా ప్రజా చైతన్య యాత్ర సాగిస్తారని చెబుతున్నారు.