టీడీపీకి కొమ్ముకాసిన అధికారులకు మూడినట్టే 

టీడీపీ తన హయాంలో రాజధాని భూములు విషయంలో అక్రమాలకు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ సర్కార్ ఆరోపిస్తూనే ఉంది.  అక్రమాల వెలికితీత కోసం సిట్ బృందాన్ని కూడా నియమించింది.  త్వరితగతిన విచారణ చేపట్టిన సిట్ టీమ్ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని నిర్థారణకు వచ్చింది.  తగిన ఆధారాలను సేకరించే పనిని మొదలుపెట్టింది.  టీడీపీ హయాంలో ఇన్ఛార్జిలుగా వ్యవహరించిన డిప్యూటీ కలెక్టర్ల పై విచారణను ముమ్మరం చేసింది. 
 
సీఆర్‌డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్‌ కనికెళ్ల మాధురిని పోలీసులు బుధవారం విజయవాడలోని అరెస్ట్‌ చేసి రిమాండ్ మీద గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.  టీడీపీ నేతలతో కలిసి 3,880 చదరపు గజాలు కలిగిన పది ప్లాట్లను కేటాయించడంతో పాటు రూ.5.26 లక్షల కౌలు చెల్లించారని,  తప్పులను కవర్ చేయడానికి తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారని అధికారులు  మాధురిపై కేసు రిజిస్టర్ చేశారు.
 
మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ అనుచరుడైన రావెల గోపాలకృష్ణ ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ప్రభుత్వానికి 3.11 ఎకరాలు ఇచ్చినట్టుగా చూపించారు.  దానికి పరిహారంగా 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను, 3,110 చదరపు గజాలు కలిగిన 8 నివాస స్థలాలను
సీఆర్‌డీఏ ద్వారా కేటాయించారు.  కానీ పూలింగ్ కోసం ఇచ్చిన  ఆ భూమి నాగార్జునసాగర్‌ కాలువ, రెండు రోడ్లకు చెందినవి కాబడంతో డిప్యూటీ కలెక్టర్ తప్పుడు రికార్డులు సృష్టించి ఇప్పుడు దొరికిపోయారు.  
 
ఇవే కాక అటవీ భూములు, కుంటలు, మిగులు భూములను కూడా రిజిస్టర్ చేశారని, మొత్తం మీద 150 ఎకరాల కుంభకోణం జరిగినట్టు సిట్ గుర్తించింది.  ఈ దందాలో డిప్యూటీ కలెక్టర్‌తో పాటుగా నేతలతో కలిసి అవినీతిలో పాలుపంచుకొన్న రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై కూడా సిట్ దృష్టి పెట్టింది.  అవినీతికి పాల్పడ్డారని రుజువైతే ఎవ్వరినీ వదిలేది లేదని సర్కార్ అంటుండటం, సిట్ విచారణ వేగవంతం చేయడంతో కుంభకోణానికి కొమ్ముకాసిన అధికారుల్లో ఆందోళన మొదలైంది.