టిడిపి నేతల అవినీతి పై దూకుడు పెంచిన జగన్ సర్కార్

ESI ఆసుపత్రులకు మందులు ఇతర పరికరాలు కొనుగోలులో దాదాపు 70 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సెమెంట్ అధికారులు ఇచ్చిన నివేదిక శనివారం పెద్ద దుమారం లేచింది. ముగ్గురు డైరెక్టర్ స్థాయి అధికారులు ఇందుకు భాధ్యులుగా తేల్చింది. వీరికి మరొక ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు ఇతర అధికారులు సిబ్బంది సహకరించినట్లు పేర్కొన్నారు. కొన మెరుపు ఏమంటే మాజీ మంత్రి అచ్చెమనాయుడు రాసిన లేఖ మేరకు నామినేషన్లుపై మందులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ దెబ్బతో టిడిపి వైసిపి నేతల మధ్య ప్రకటనల యుద్ధం మొదలైంది. రాష్ట్ర కార్మిక మంత్రి జయరాం మాట్లాడుతూ పూర్తి విచారణకు ఆదేశించామని తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించ తప్పదన్నారు. అచ్చెమ నాయుడు కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు. నామినేషన్ల మీద కాంట్రాక్టు ఇవ్వమని తాను లేఖ రాయలేదని ఎటువంటి విచారణకైనా సిద్ధమన్నారు. చివరకు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని శాసన సభలో ఆచ్చెమ నాయుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందున బిసి నేత అయిన ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. 

ఇవన్నీ అటుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం అవినీతి వెలికి తీసేందుకు వేసిన మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది మందితో సిట్ ను నియమించింది. ఒక విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొలకొంటోంది. అధికార ప్రతిపక్షాలు అస్త్రాలన్నీ ఒన కూర్చుకొంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వున్న కేసులను ప్రాజెక్ట్ చేసేందుకు సెర్బియా లో అరెస్టు కాబడి వున్న నిమ్మగడ్డ ఎపిసోడ్ ను వాడుకొనేందుకు టిడిపి నేతలు సిద్దమౌతుంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను వెతికి పట్టి కొందరినైనా బోనులో నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నాహాలు చేస్తోంది.ఇది మున్ముందు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం వుంది.