టిడిపి నేతలకు సెక్యూరిటీ తొలగింపు… పోలీసు యంత్రాంగానికి సవాలే!

రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతి పక్షం మధ్య రోజు రోజుకు లడాయి పెరిగి పోతోంది. టిడిపి ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు రోజు రోజుకు ఉధృతం చేసే కొద్ది ప్రభుత్వ పక్షం కూడా అంతకు రెట్టింపు కవ్వింపు చర్యలకు దిగుతోంది. రాజధాని ఉద్యమం శాసన మండలి గొడవ మరింత ఉద్రిక్తత పెంచుతోంది. తాజాగా టిడిపి ప్రముఖ నాయకులకు అందులో ఫ్యాక్శనిస్టు ప్రభావం ఎక్కువగా వున్న నేతలకు ప్రభుత్వం సెక్యూరిటీ తొలి గించింది. ఇది మధ్య యుగాల రాజనీతిని పోలి వుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు . శత్రు శేషం వుండ కూడదనే సూత్రమే ఈ విధానానికి ఆలంబనంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు సహజంగా చెల్లుబాటు కావు. కాని వైసిపి ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో గాని ఒక్కో సమయంలో దీని పరిణామాలు తీవ్రంగా వుండే అవకాశం వుంది.

ఒక వేళ జరగదానిదేదైనా జరిగితే ప్రభుత్వం అప ప్రధ భరించాలని వుంటుంది. ఈ రోజు అయితే ఏదో సాకుతో తప్పించుకోవచ్చు గాని పీక మీదకు వచ్చినపుడు చెప్పుకొనేందుకు ఏ ప్రభుత్వానికి వెసులు బాటు వుండదు. అయితే స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని ఇందులో రాజకీయం లేదని పోలీసు యంత్రాంగం నేడు సులభంగా తప్పించుకోవచ్చుగాని టిడిపి నేతలకు తొలగించిన సెక్యూరిటీ విధానం మాత్రం పోలీసు యంత్రాంగానికి మెడ మీద కత్తిలా వేలాడుతూ వుంటుంది. మాజీ పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పల్నాడు ప్రాంతానికి చెందిన జివి ఆంజనేయులు యరపతినేని లాంటి వారు తీవ్ర ముఠా తగాదాలున్న ప్రాంతాల్లో వున్నారు. వీరికి సెక్యూరిటీ తొలగించడ మంటే ప్రమాదపుటంచులకు వీరిని నెట్టడమే. ఏం జరిగినా పోలీసు యంత్రాంగం అపవాదు కొని తెచ్చుకున్నట్లే. వాస్తవంలో ఎవరు ఏ పార్టీకి చెందిన వారైనా ఎవరు అధికారంలో వున్నా ప్రమాద మున్న ప్రతి పౌరునికి పోలీసు వ్యవస్థ భద్రత కల్పించ వలసి వుంది. తుదకు నాలుగైదు రోజుల్లో ఉరిశిక్ష అమలు జరిగే ఖైదీకి వరస హత్యలు చేసిన అతిక్రూర నేరస్తుడికి రక్షణ ఇవ్వాల్సిన కర్తవ్యం పోలీసు వ్యవస్థకు వుంది. కాని రాష్ట్రంలో తీవ్ర మైన ఉద్రిక్త పరిస్థితులు వున్న తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు రివ్యూ సమావేశంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అనూహ్యంగా వుంది.

వీరితో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు పత్తిపాటి పుల్లారావు నక్కా ఆనంద బాబు కాలువ శ్రీనివాసులు పల్లె రఘునాథ రెడ్డి తదితరులకు సెక్యూరిటీ పూర్తిగా తొలగించారు. ఈ నిర్ణయం రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ సమావేశంలో తీసుకున్నారని చెబుతున్నందున రేపు వచ్చే అపనింద రాజకీయాలు పక్కన పెడితే పోలీసు ఉన్నతాధికారులే భరించ వలసి వుంటుంది గతంలో చంద్రబాబు నాయుడుకు సెక్యూరిటీ తగ్గించిన వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. అనంతరం లోకేష్ కు సెక్యూరిటీ తగ్గించారు. అంతా సాఫీగా జరిగితే ఎవరికి ఇబ్బందులు వుండవు. కాని జరగ రానిది జరిగితే ముందుగా టార్గెట్ అయ్యేది రివ్యూ పేర సమావేశం నిర్వహించిన పోలీసు అధికారులే.

అయితే రానున్న పంచాయతీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేందుకు వీలు లేకుండా తమ కాళ్ల కు బంధం వేసేందుకు ప్రభుత్వం ఈ చర్యకు తలపడిందని టిడిపి నేతలు చెబుతున్నారు. కాని ఇది రాజకీయం. అసలు సమస్య అదికాదు. ప్రాణహాని వుండే వారికి భద్రత కల్పించక పోవడమే.