టిడిపికి కొత్త మిత్రుడు దొరికాడా?

విజయవాడలో మంగళవారం ఇది సూచన ప్రాయంగా ఆవిష్కరణ అయింది. మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న సభలో టిడిపి పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని పాల్గొన్నారు. వాస్తవంలో ఈ సభను స్థానిక మజ్లిస్ (ఐయంఐ) పార్టీ ఏర్పాటు చేసింది. గత కొన్ని ఏళ్లుగా టిడిపికి మజ్లిస్ పార్టీకి ఎట్టి సంబంధాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మజ్లిస్ పార్టీ డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా వుండేది. రాష్ట్ర విభజన తర్వాత టిఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ కలసి మెలసి వున్నాయి. అంతేకాదు నిన్న మొన్నటి వరకు మజ్లిస్ పార్టీ వైసిపి దోస్త్ గా వున్నాయి. మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సిఎఎ(పౌర సత్వ సవరణ చట్టై) కి వ్యతిరేకంగా విజయవాడ మజ్లిస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు వచ్చారు. కాని పాత మిత్ర పార్టీ నేతలు ఎవరూ అటు వేపు చూడ లేదు. కాని టిడిపి పార్లమెంటు సభ్యులు కేసినేని నాని హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నాని మాట్లాడారు. ఈ సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సిఎఎ కి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. అలాంటి తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని కేసినేని నాని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంలో గమనార్హమైన అంశమేమంటే ఈ చట్టం ఉభయ పార్లమెంటు సభల్లో ఆమోదించే సమయంలో వైసిపి టిడిపి రెండు పార్టీలు బలపర్చాయి. ఇందుకు అనుకూలంగా ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు శాసన మండలి రద్దు అంశాల్లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై ఆధార పడివున్నందున మజ్లిస్ పార్టీతో గతంలో సాన్నిహిత్యం వున్నా అసదుద్దీన్ సభకు వైసిపి నేతలు తొంగి కూడా చూడలేదు. మున్ముందు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాల అంశంలో వ్యతిరేక వైఖరి తీసుకొనే అవకాశం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్మానం ఆమోదించినట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో శాసన సభ అట్టి తీర్మానం ఆమోదించే అవకాశం లేదు. 

హైద్రాబాద్ లో పాత బస్తీ కే పరిమితమై వుండిన మజ్లిస్ పార్టీ తెలంగాణలో బాగా విస్తరించుతోంది. అదే ఊపులో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాలూనుతోంది. మరీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తెచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని మైనార్టీలు మజ్లిస్ పార్టీ వేపు మొగ్గుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తాము ఓట్లు వేసిన వైసిపి పార్లమెంటులో బిజెపిని బరపర్చడంతో మైనార్టీలకు మజ్లిస్ పార్టీ దిక్కు అయింది. ఈ పరిణామమే విజయవాడలో భారీ ఎత్తున సభ జరగడం. మొన్న పార్లమెంటులో టిడిపి సభ్యులు అనుకూలంగా వ్యవహరించినా మున్ముందు అలా కుదరకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మైనార్టీలు కట్టగట్టుకొని వైసిపి కి ఓట్లు వేశారు. బిజెపి తెచ్చిన బిల్లులకు వైసిపి అనుకూలంగా వున్నందున మైనార్టీల ఓట్ల కోసం టిడిపి వ్యతిరేక వైఖరి తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి కొత్త మిత్రుడు దొరికినట్లే