బీజేపీ ప్రభుత్వ ప్రస్తుత లక్ష్యం ఎన్ఆర్‌సి అమలు. అయితే అన్ని విషయాల్లో మోడీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్ఆర్‌సి విషయంలో కూడా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికారు. కానీ బయట అంటే రాష్ట్రంలో మాత్రం ముస్లింల ఓటు బ్యాంక్ కోసం ఇప్పుడు దానికి వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు.
మైనారిటీల నుండి వస్తోన్న ఒత్తిడిని తట్టుకోలేక ఎన్ఆర్‌సిని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎన్ పిఆర్ ను అమలు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎన్యూమరేటర్లకు శిక్షణ కూడా పూర్తి చేశారు. ఏప్రిల్ 1 నుండి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లు తమ పని కూడా చేస్తారట. అయితే ఇన్ని రెడీ చేసి మళ్లీ ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
సీఏఏ, ఎన్ ఆర్ సి, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు అనేక ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దీక్షలకు వెళ్లి మద్దతిస్తోన్న ప్రజా ప్రతినిధులు మాత్రం మా ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకం, ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రకటించారు, ముస్లింల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం అంటూ దీక్షలు విరమింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే 2010లో జరిగిన ఎన్‌పీఆర్‌కి, ఇప్పుడు నిర్వహించనున్న ఎన్‌పీఆర్‌కి తేడా ఉండడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. దీంతో గతంలో చేసిన విధంగానే జనగనణ జరగాలన్నది తమ డిమాండ్ అని వైసీపీ నేతలు ముస్లింలకు చెబుతున్నారు. ఈ మేరకు ముస్లింలకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయబోతున్నామని చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో.. పార్లమెంటులో సైతం మద్దతు ఇచ్చి రాష్ట్రంలో మాత్రం ఇలా మాట్లాడటం వెనుక ఎలాంటి నిర్ణయం ఉంటుందో..? అలాగే వైకాపా నాయకులు చెబుతున్నట్లు ఎన్ఆర్‌సి వ్యతిరేకంగా నిలబడితే మోడీకి జగన్ రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లే.. మరి జగన్ ఆ పనిచేస్తారో లేదో చూడాలి.