తిరుమల తిరుపతి దేవస్ధానం చరిత్రలో ఇలాంటి రోజు వస్తుందని ఎవరూ అనుకోలేదు. ట్రస్టు బోర్డు సభ్యుల నియామకం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు జాప్యం చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. టిటిడి బోర్డుకు ఛైర్మన్ గా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించి రెండు నెలలవుతోంది. మరి బోర్డు సభ్యుల నియామకం విషయంలో మాత్రం ఎందుకు లేటవుతోంది ?
ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమైనా బోర్డులో సభ్యులుగా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల్లోని ప్రముఖులకు కూడా చోటు కల్పించారు. ఎలాగూ ఎస్సీ, ఎస్టీ ఎంఎల్ఏలకు ఇందులో చోటుంటుంది. వీరు కాకుండా అధికార పార్టీతో సన్నిహితంగా ఉండే నేతలో లేకపోతే వివిధ రంగాల్లోని ప్రముఖులకు చోటు దక్కటం మామూలుగా జరిగేదే.
ఈ లెక్కన తీసుకున్నా వైసిపిలో చాలామంది బోర్డులో సభ్యత్వాలు తీసుకునేందుకు రెడీగానే ఉన్నట్లు సమాచారం. వివిధ రంగాల్లోని ప్రముఖులకూ కొదవ లేదు. బోర్డులో సభ్యులుగా నియమిస్తామని జగన్ చెబితే ఎగిరి గంతేసే వాళ్ళే కానీ వద్దనే వాళ్ళు ఎవరూ ఉండరు. అన్నీ రెడీగానే ఉన్నా సభ్యులను నియమించటంలో జగన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నట్లు ?
మామూలుగా ఏ ప్రభుత్వమైనా బోర్డును నియమిస్తోందంటే ఛైర్మన్ తో పాటు సభ్యులను కూడా ఒకేసారి నియమించేస్తుంది. చంద్రబాబునాయుడు హయాం వరకూ జరిగింది అదే. ఒక్క జగన్ ప్రభుత్వం మాత్రమే సభ్యుల నియామకం జరపకుండా ఛైర్మన్ ను మాత్రమే నియమించింది.