జ‌గ‌న్‌కి తిరుగులేని స‌వాలు… ఇక నిరూపించాల్సింది వైసీపీ నేత‌లే!

చంద్ర‌బాబు గుర్తులు ఉండ‌కూడ‌ద‌నుకున్నారో… లేక నిజంగానే రాష్ట్రానికి అమ‌రావ‌తి వంటి న‌గ‌రం అక్క‌ర్లేద‌నుకున్నారో కానీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో తొలి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారు. అయితే అదే స‌మ‌యంలో అటు నుంచి అమ‌రావ‌తి ప్రాంత రైతులు కూడా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల మాదిరి ఉద్య‌మం కొన‌సాగిస్తూనే ఉన్నారు. మొక్క‌వోని దీక్ష‌ల‌తో వారు చేస్తున్న పొరాటానికి దేశం యావ‌త్తు అచ్చెరువొందుతున్న సంగ‌తి విధిత‌మే. అలాంటి త‌రుణంలో వారి పోరాటాన్ని అణ‌చివేయ‌డానికి అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నించిన ప్ర‌భుత్వ పెద్ద‌లు చివ‌ర‌కు వారిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అయితే, వైసీపీ నేత‌లు మాత్రం త‌మ ఉక్రోషాన్ని ఆపుకోలేక రాజ‌ధాని రైతుల‌పై అభాండాలు వేశారు. వారు పెయిడ్ ఆర్టిస్టులంటూ ప‌స‌లేని ఆరోప‌ణ‌లు చేశారు.

ఇలా పెయిడ్ ఆర్టిస్టులంటూ చేసిన వ్యాఖ్య‌లకు సిని న‌టుడు పృథ్వి వంటి వారు మూల్యం చెల్లించుకున్నారు. ఆ త‌ర్వాత వైసీపీ నేత‌లు కూడా ఆ త‌ర‌హా వ్యాఖ్య‌లు పెద్ద‌గా చేయ‌లేదు. అయితే, రైతులు మాత్రం త‌మ‌పై పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వేసిన నింద‌ల‌ను మ‌ర్చిపోలేదు. అందుకే ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నా క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో కూడా త‌మ ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. చివ‌ర‌కు ఇవాళ దేశం మొత్తం లాక్ డౌన్ చేసే వ‌ర‌కూ కూడా ఉద్య‌మ శిబిరాలు జై అమ‌రావ‌తి నినాదాల‌తో మారుమోగాయి. దేశం మొత్తం లాక్‌డౌన్ చేసిన నేప‌థ్యంలో ఈ రోజు నుంచి శిబిరాల‌కు రాకుండా ఎవ‌రి ఇళ్ల‌లో వారు కూర్చుని దీక్షలు చేస్తామ‌ని ప్ర‌క‌టించి త‌మ ఉద్య‌మ‌స్పూర్తిని ప్ర‌ద‌ర్శించారు.

ఇదే స‌మ‌యంలో త‌మ‌ను పెయిడ్ ఆర్టిస్టులు అన్న‌వారికి తిరుగులేని స‌వాలే విసిరారు. ‘‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కంటే భయంకరమైన మహమ్మారితో పోరాడుతున్నాం. అమరావతికి పట్టిన వైరస్‌ మా పోరుతో వదులుతుంది’’ అంటూ రాజధాని రైతులు నినదించారు. అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం వరసగా 98వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. ఇంకా మమ్మల్ని పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా? అంటూ వారు మండిపడ్డారు. ‘‘పోటీ దీక్షలను ప్రోత్సహించారు. మాది జీవన్మరణ సమస్య. ఇకనైనా మంకుపట్టు వదిలి మా ఆందోళనలను అర్థం చేసుకోండి’’ అని సీఎం జగన్‌ను వేడుకున్నారు. కాగా, రైతులు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా శిబిరాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీక్షా శిబిరాల్లో వ్యక్తికి, వ్యక్తికి మధ్య మూడు మీటర్ల దూరం పాటిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డులు ఏర్పాటు చేశారు.

శిబిరాల్లో వంతుల వారీగా రైతులు పాల్గొంటున్నారు. అలాగే, 29 గ్రామాల్లో దీక్షలు కొనసాగించారు. ప్రతి వీధిలో పది మంది చొప్పున ఆందోళనలు కొనసాగించారు. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా దేశమంతటా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రైతుల దీక్షా శిబిరాలను పూర్తిగా మూసివేస్తున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే, రైతులందరూ వారి వారి ఇళ్లలోనే ఉండి రాజధాని కోసం నిరసన తెలుపుతారని చెప్పారు. ఈ మేరకు జేఏసీ నేతలు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే క‌రోనా అయినా మ‌రేదైనా స‌రే త‌మ జీవ‌నాధారం కోసం పోరాటం మాత్రం కొన‌సాగుతుంద‌ని వారు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. వారిని పెయిడ్ అర్టిస్టులంటూ నోరు పారేసుకున్న నేత‌లు ఇప్పుడేమంటారో.