జేసీ దెబ్బకు చంద్రబాబు షాక్!?

సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు తిరిగి పుంజుకోవాలని సర్వ యత్నాలు చేస్తోంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపి ప్రజల్లోకి వెళ్తోంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా లాభం కనబడుతున్నట్లు లేదు. దీనికి కారణం అధినేత చంద్రాబాబు తీసుకునే నిర్ణయాలే అని ఆ పార్టీ నేతలే ఆరోపించడం గమనార్హం. కష్టపడే వారిని, పార్టీకి పేరుతేగల వారిని వదిలేసి.. చుట్టూ భజన చేసే వారినే చంద్రబాబు ప్రోత్సహించడం వల్లే ఇప్పటికీ పార్టీకి చాలా మంది నేతలు దూరమయ్యారన్నది అంటున్నారు.

తాజాగా చంద్రబాబు వైఖరి వల్ల మరో నేత పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి గత రెండు మూడు రోజులుగా చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని జోష్యం చెప్పిన జేసీ ఆయన వర్గం నుంచి ఎవరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేసేశారు. పైగా విశాఖలో చంద్రబాబును కొట్టకపోవడం అదృష్టం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే జేసీ ఇక టీడీపీకి గుడ్ బై చెప్పేలానే కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

టీడీపీ ఓటమి అనంతరం తన వర్గం నుంచి కూడా జేసీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా పార్టీ మారాలి అని జేసిని పదే పదే ఫోర్స్ చేస్తున్నారట. పైగా తన వ్యాపారాలు కూడా చాలా దెబ్బతినే పరిస్థితులు తలెత్తుతున్నాయని టాక్. దీనితో జేసీ కూడా పార్టీ మారాలని నిర్ణయించుకుని.. దానికి తగ్గట్టుగా తన ప్రయత్నాలు మొదలు పెట్టారని అనిపిస్తోంది. గతంలో కూడా పార్టీ వల్ల పెద్దగా జరిగిన లాభం ఏమీ లేదు కాబట్టి ఇప్పుడైనా పార్టీ మారితే తన వర్గానికి కాస్తో కూస్తో మేలు చేసినట్లు అవుతుందని భావిస్తున్నారట.

ఏది ఏమైనా చంద్రబాబు తీరుపై చాలా కాలంగా పార్టీనేతల్లోనే అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ నుండి వెళ్లే ముందు, వెళ్ళిపోయిన తర్వాత నేతలంతా బాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొంటారా? పార్టీని కాపాడుకునేందుకు చర్యలు చేపడతారా లేదా అన్నది వేచి చూడాలి.