జేసీ దివాకర్ రెడ్డి మాటలు నిజం కానున్నాయా?

(పోసాని మురళి)

కడప: ఉక్కు లేదూ.. తుక్కూ లేదూ.. అంటూ కుండ బద్దలు కొట్టిన సీమ ప్రాంత ఎం పి జేసీ దివాకర్ రెడ్డి మాటలు నిజం కానున్నాయా.. అవును పరిస్థితులు ఆయన మాటలకు అనుకూలంగానే సాగుతున్నాయనిపిస్తోంది… కడపలో ఉక్కు ఆమరణ దీక్ష సాగబట్టి ఎనిమిది రోజులు దాటి తొమ్మిదికి చేరుకుంది. అయినా ఉలకడు.. పలకడు.. పట్టించుకోవడం లేదు మోడీ.. అసలు మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదు.. ఆంధ్ర అంటే ఆయనకు ఇష్టం లేదా.. ఇక్కడ జరిగే అభివృద్ధి ఆయనకు అసూయగా మారిందా.. ఏమో..

ఏదేమైనా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి చర్యలు చేపట్టాలి. ఆంధ్ర లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే పోరాటాలు చేయాలా.. ప్రాణాలు పోవాలా.. ఎందుకు ఈ ప్రాంతాలకు ఈ దుస్థితి..

నిజమే.. మొన్నటికి మొన్న కడపలో దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను పరామర్శించడానికి వచ్చారు.. అనంతపురం ఎం పి జేసీ దివాకర్ రెడ్డి.. .. ఆయన అదే వేదిక పై నుంచి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు.. ఈ మోడీ ఉన్నంత కాలం కడపకు ఉక్కు రాదు.. తుక్కూ రాదంటూ చెప్పేశారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తే.. అది నిజమేనేమో అన్న అనుమానం తలెత్తుతోంది. నిన్న కేంద్రం లోని సర్కారు కడప ఉక్కు పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక రాలేదంటూ ఆ నెపం ఏపీ పైనే నెట్టేసింది. ఇవాలేమో.. టీడీపీ ఎం పి లంతా కలిసి ప్రధాని మోడీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరితే తిరస్కరించారు. ఎందుకు.. అసలేం జరుగుతోంది.. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం జేసీ వారు చెప్పిన మాటల్లో వెతుక్కోవాల్సి వస్తోంది.
తొమ్మిది రోజుల ఆమరణ దీక్షలో.. నిన్న అంటే ఎనిమిదో రోజు ఎమ్మెల్సీ రవి దీక్ష భగ్నం అయింది. ఇక సీఎం రమేష్ దీక్ష మిగిలి ఉంది.. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణీస్తోంది.. కుటుంబసభ్యుల్లో ఆందోళన క్షణక్షణం పెరుగుతోంది. కేంద్రం ఉలక్కుండా.. పలక్కుండా.. ఉంది. వడ్డించే అమ్మే మొహం చాటేస్తే.. ఇక ఉక్కు ను ఇచ్చేవారేవరు..