తెలంగాణలో లాక్ డౌన్ మే 31 కొనసాగనుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహాయించి మిగిలినవన్నీ గ్రీన్ జోన్లుగా పరిగణించామని కేసీఆర్ వెల్లడించారు. కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు, అలా అని బతుకును బంద్ పెట్టుకుని జీవించలేము కదా అంటూ కేసీఆర్ కరోనా పై తన అభిప్రాయం ఏమిటో చెప్పారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. అలా జీవించడం రాకే కదా ప్రపంచం అల్లాడిపోతుంది.
ఇక కేసీఆర్ లాక్ డౌన్ లో సడలింపుల గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చట, అలాగే సెలూన్లు తెరుచుకోవచ్చు. కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం సెలూన్లు తెరవొద్దు అని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు అని కేసీఆర్ కోరారు, ఇక బార్లు, క్లబ్బులు, జిమ్ములు, పార్కులు అన్ని బంద్ లో ఉంటాయి.
ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. షాపు ఓనర్స్ శానిటైజర్లను తప్పనిసరి ఉంచాలి, 65 ఏళ్ల పైన ఉన్న వృద్ధులను, పిల్లలను బయటకు రానివ్వకూడదు అని స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని కేసీఆర్ చెప్పారు.
మరి కేసీఆర్ మాటలను ప్రజలు ఎంత సీరియస్ గా తీసుకుంటారో.. ఫుల్ లాక్ డౌన్ లోనే హైదరాబాద్ రోడ్స్ అన్ని బిజీగా కనిపించాయి. అలాంటిది తిరగమని ప్రభుత్వమే అవకాశం ఇచ్చాక, జనం ఇష్టమొచ్చినట్టు తిరగకుండా ఉంటారా ? ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే మళ్లీ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. అప్పుడే ప్రజల్లో భయం ఉంటుంది.