జగన్ విషయంలో బిజెపిలో కన్ఫ్యూజన్

జగన్మోహన్ రెడ్డి విషయంలో బిజెపి నేతల్లో ఫుల్లుగా కన్ఫ్యూజన్ ఉన్నట్లు అర్ధమవుతోంది. కొంతమందేమో జగన్ పాలనకు అనుకూలంగా మాట్లాడుతుంటే మరికొందరేమో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అనుకూలంగా మాట్లాడుతున్న నేతలేమో అంశాలవారీగా భేష్ అంటున్నారు. అదే సమయంలో జగన్ ను వ్యతిరేకిస్తున్న వారేమో ప్రతి విషయాన్ని అవసరం లేకపోయినా వ్యతిరేకిస్తున్నారు.

మొత్తానికి కమలనాధుల వైఖరి చూస్తుంటే ఎంత అయోమయంలో ఉన్నారో అర్ధమైపోతోంది. సమస్య ఎక్కడ మొదలైందంటే ఎన్నికల్లో వైసిపి గెలిచిన తర్వాత కూడా జగన్ పై బిజెపి నేతల్లో వ్యతిరేకత కనబడలేదు. ఎప్పుడైతే నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి ఫిరాయించారో అప్పటి నుండో కమలం పార్టీలో కొందరు నేతలు జగన్ కు వ్యతిరేకంగా గొంతులేపుతున్నారు.

అంశాల వారీగా జగన్ పాలనను సమర్ధిస్తున్న వారిలో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మొదటివరసలో ఉన్నారు. పిపిఏలు, పోలవరంలో అవినీతి, రాజధాని నిర్మాణంలో చంద్రబాబునాయుడు చేసిన అవినీతిని బయటపెట్టాల్సిందే అంటూ గట్టిగా వాదిస్తున్నారు. జగన్ పాలనను  తాజాగా ఆర్ఎస్ఎస్ నేత ఉమేష్ జీ కూడా బ్రహ్మాండమంటున్నారు.

హిందుదేవాలయాల్లో అన్యమతస్తులను ఉద్యోగులుగా నిషేధించటాన్ని భేష్ అంటున్నారు. బిజెపి సిఎంలు కూడా చేయలనే సాహసాన్ని జగన్ చేశారంటూ ఆకాశానికి ఎత్తేశారు. అదే సమయంలో  చంద్రబాబు అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి జగన్ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. ఈయనకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వంత పాడుతున్నారు. పార్టీలో కొందరు జగన్ కు అనుకూలంగాను మరికొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతుండటంతో న్యూట్రల్ గా ఉన్న నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద బిజెపి నేతల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.