జగన్ భేష్ అంటున్న ప్రతిపక్ష నేతలు

రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన పార్టీల అధినేతలేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై 24 గంటలూ విమర్శలు చూస్తు ఆరోపణలు చేస్తుంటే అవే పార్టీల నేతలు మాత్రం బ్రహ్మాండమంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే బిజెపి, టిడిపి నేతలు జగన్ నూరు రోజుల పరిపాలన బ్రహ్మాండమని కితాబులివ్వటం రెండు పార్టీల్లోను సంచలనంగా మారింది.

మాజీ ఎంపి టిడిపి నేత జేసి దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ నూరు రోజుల పాలన బాగుందన్నారు. జగన్ ప్రభుత్వానికి మార్కులు వేయాల్సొస్తే తాను నూరు మార్కులు వేస్తానన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నూటపది మార్కులు కూడా వేస్తానన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చి నూరు రోజులే అయ్యింది కాబట్టి అప్పుడే ఆరోపణలు, విమర్శలు చేయటం తగదన్నారు. సమాజానికి ఏదో మంచి చేద్దామని జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బిజెపి ఎంపి టిజి వెంకటేష్ మాట్లాడుతూ జగన్ పాలన బాగుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటం మంచిదే కదా అన్నారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చటానికి జగన్ షెడ్యూల్ పెట్టుకోవటం చాలామంది లక్షణమన్నారు. రాజధానిని అభివృద్ధి చేసినట్లే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. ఒకవైపు చంద్రబాబునాయుడు, కన్నా లక్ష్మీనారాయణ ఏమో జగన్ పై ఒంటికాలిపై మండిపడుతుంటే వీళ్ళు మాత్రం కితాబులిస్తుండటం జనాల్లో చర్చలు మొదలయ్యాయి.