జగన్ ప్రతిష్టకు మచ్చ ?

జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టగా తీసుకున్న గ్రామ సచివాలయాల పరీక్షల నిర్వహణపై ఆరోపణలు ముసురుకుంటున్నాయి. గురువారం ఫలితాలు విడుదలయ్యాయో లేదో వెంటనే ప్రశ్నపత్నం లీకేజి అయ్యిందనే ఆరోపణలు మొదలైపోయాయి. దానికి తగ్గట్లే చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే ఓ మీడియాలో లీకేజిపై పెద్ద కథనమే వచ్చింది.

కథనం ప్రకారం పేపరు ఎలా లీకైంది ? లీకేజికి బాధ్యులెవరు ? అసలు లీకేజి జరిగిందా ? అనేందుకు మద్దతుగా కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చింది. ఈ కథనం ప్రకారమైతే లీకేజి జరిగిందనే అనిపిస్తోంది. కమీషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబసభ్యులు, ఓ ఉద్యోగి భార్య, ముగ్గురు కుటుంబసభ్యులకే టాప్ ర్యాంకులు వచ్చాయట. ఇలా టాప్ ర్యాంకులు వచ్చిన వారి వివరాలు, వారికి కమీషన్ ఉద్యోగులతో బాంధవ్యాన్ని కూడా వివరించింది.

నిజానికి  పేపర్ లీకేజి కథనం నిజమే అయితే దానికి పూర్తి బాధ్యత పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ దే అనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఓఎస్డి గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారానే లీకయినట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహించటంలో కమీషన్ ది ఎంతో కీలక పాత్ర.  అయితే అంతకుముందు నిర్వహించాల్సిన గ్రౌడ్ ప్రిపరేషన్లో పంచాయితీరాజ్ శాఖది కూడా అంతే కీలక బాధ్యత.

మొత్తానిక జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయాల పరీక్ష పేపర్ లీకైందంటే ప్రభుత్వానికి మచ్చ అనే  చెప్పాలి. ఇంతకుముందు గ్రామ, వార్డు వాలంటీర్ల ఎంపికలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా  చేసిన విషయం తెలిసిందే. కాబట్టి ఇపుడు లీకేజీ కథనంపై ప్రభుత్వం విచారణ జరిపితేనే బాగుంటుంది. తర్వాత ఏమి చేయాలనే విషయంలో జగనే నిర్ణయం తీసుకుంటారు.