జగన్ పై మత వ్యతిరేక ప్రచారం

రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకపోవటంతో ఇపుడు పచ్చ కమలం నేతలు జగన్మోహన్ రెడ్డిపై మత వ్యతిరేకి ముద్ర వేస్తున్నారు. జగన్ హిందుమతానికి వ్యతిరేకమంటూ ట్వీట్లు పెట్టి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమధ్యనే టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ ఈ మత వ్యతిరేక ప్రచారానికి ఆజ్యం పోశారు. దాన్ని ముందు వెనుక చూడకుండా బిజెపి నేతలు యాగీ  చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే అమెరికా పర్యటనలో ఉన్న ఓ సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేయటానికి ఇష్టపడలేదట. దాన్ని పట్టుకుని జగన్ పై  సిఎం రమేష్ హిందుమత వ్యతిరేకి అంటూ పోస్టులు పెట్టారు. జ్యోతి ప్రజ్వలనకు సంబంధించిన వీడియోను కూడా రమేష్ పోస్టు చేశారు.

అయితే ఇక్కడే రమేష్ తప్పులో కాలేశారు. జగన్ పాల్గొన్న సమావేశం ఓ స్టేడియంలో ఏర్పాటు చేశారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన అంతా ఎలక్ట్రానిక్ పద్దతిలో జరిగిపోతుంది. అంటే దీపాల్లో నూనెలు వేసి అగ్గిపెట్టెలతో వెలిగించటం ఉండదు. పోలీసుల నిబంధనల ప్రకారం అగ్గిపుల్లలు వెలిగించటం నిషిద్ధమట. అందుకనే నిర్వాహకులు ఎలక్ట్రానిక్ పద్దతిని ఏర్పాటు చేశారు.

ఆ విషయంపై రమేష్ ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ పై బురద చల్లారు. రమేష్ ట్విట్ పెట్టారో లేదో వెంటనే దాన్నే బిజెపి అధికారిక వెబ్ సైట్ లో కూడా కాపీ పేస్ట్ చేసి ప్రచారం మొదలుపెట్టేశారు. ఇదేదో ఎద్దు ఈనింది అనగానే దూడను కట్టేయండి అన్న సామెతలాగ ఉంది. మొత్తానికి జగన్ పై ఉన్న తమ పైత్యాన్నంతా పచ్చ తమ్ముళ్ళు ఇపుడు బిజెపి నేతలకు ఎక్కిస్తున్నట్లే ఉంది.