జగన్మోహన్ రెడ్డి నూరు రోజుల పాలనలో జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కు స్పష్టత కనబడలేదట. స్పష్టత అంటే ఏమిటో మాత్రం నాదెండ్ల చెప్పలేదు లేండి. జగన్ పాలనపై జనాల్లో ఉన్న స్పష్టత మరి నాదెండ్లకు ఎందుకు కనబడటం లేదో అర్ధం కావటం లేదు. ఏ విషయంలో స్పష్టత కనబడటం లేదో చెప్పమంటే మాత్రం మాట మార్చేస్తున్నారు.
అమరావతి నిర్మాణంపై మంత్రులు చేస్తున్న ప్రకటనలు సరైనవి కావని అంటున్నారు. రాజధానిని మార్చేస్తామని ఏ మంత్రి కూడా చెప్పలేదు. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేయటంలో ఉన్న ఇబ్బందులను మాత్రమే మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బొత్స మాటల్లో కొత్తదనం కూడా ఏమి లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబునాయుడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు ఇచ్చిన అఫిడవిట్లో చెప్పిందే ఇపుడు బొత్స చెప్పారు.
నిజానికి అమరావతి ప్రాంతంలోనే రాజధాని నిర్మించాలని ఏ ప్రజలు కూడా చంద్రబాబును కోరలేదు. చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడుకుని డిసైడ్ చేసిన తర్వాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇంతోటి దానికే అమరావతి విషయంలో జనాలందరూ ఆందోళన పడుతున్నట్లు నాదెండ్ల బిల్డప్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.
పనిలో పనిగా రాజధాని ప్రాంతంలో అవినీతి జరిగితే విచారణ చేసి నిరూపించాలని అన్నారు. విచారణ జరిపించాలని అన్నారే కానీ అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేయలేదు. ఇక్కడే టిడిపి-జనసేన మధ్య బంధం అందరికీ అర్ధమైపోతోంది. సరే రివర్స్ టెండర్ల విధానాన్ని కూడా విమర్శించేశారు లేండి. మొత్తానికి నాదెండ్ల కూడా జగన్ పై విమర్శలు, ఆరోపణలు మొదలుపెట్టేశారు.