జగన్ ను ఇబ్బందులో పడేసిన విజయసాయి

విజయసాయి అత్యుత్సాహం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జగన్ రాజీనామా కోరటానికి ప్రతిపక్షాలకు ఓ ఆయుధంలా మారింది. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి పార్టీ సమావేశంలో మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల నియామకాల్లో 90 శాతం పార్టీ కార్యకర్తలకే వచ్చాయన్నారు. తాన దగ్గరున్న లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నట్లు చెప్పారు.

అలాగే గ్రామ సచివాలయాల పోస్టుల నియామకాల్లో కూడా పార్టీ వారిలో కొందరికి ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పారు. రాని వారికి ఏదో రూపంలో న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. నలుగురు మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలను విజయసాయి బహిరంగంగా మైకులో చెప్పటమే ఇపుడు సమస్యగా మారింది. విజయసాయి మైకులో  చెప్పిన మాటలను టిడిపి క్యాచ్ చేసింది. దాన్ని బాగా హైలైట్ చేస్తోంది.

ఎప్పుడైతే విజయసాయి మాటలు బయటకు పొక్కాయో వెంటనే ఉద్యోగాలు రాని నిరుద్యోగులను ప్రభుత్వంపైకి టిడిపి  రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. ట్విట్టర్లో చంద్రబాబునాయుడు, లోకేష్ కూడా  ఇపుడిదే పనిలో ఉన్నారు. పైగా జగన్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేయాలని డిమాండ్లు కూడా మొదలుపెట్టేశారు. లేకపోతే విద్యాశాఖ, పంచాయితీరాజ్ శాఖ  మంత్రులతో  రాజీనామాను అయినా చేయించాలట.

నిజానికి ఐదేళ్ళు అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు చేసింది కూడా ఇదే. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సర్పంచులను కూడా పక్కన పెట్టేశారు. జన్మభూమి కమిటిలను సృష్టించి మొత్తం అధికారాలను వాటికే కట్టబెట్టారు. ఆ కమిటిలన్నింటినీ పార్టీ నేతలతోనే నింపేశారు. విచిత్రమేమిటంటే జన్మభూమి కమిటీలపై అప్పట్లో టిడిపి నేతలే గోల పెట్టేశారు అయినా చంద్రబాబు వాళ్ళ నోళ్ళు మూయించేశారు.

తర్వాత ప్రతిపక్షాలు గోల చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నది వాస్తవం.  మొన్నటి ఎన్నికల్లో జనాలు టిడిపికి వ్యతిరేకంగా కసితో వైసిపికి ఓట్లేయటంలో జన్మభూమి కమిటిల అరాచకాలు కూడా ప్రధాన పాత్ర పోషించింది.  అలాంటి చంద్రబాబు కూడా ఇపుడు జగన్ రాజీనామా కోరుతున్నారంటే విజయసాయి అత్యుత్సాహమే కారణమని చెప్పక తప్పదు.