జగన్ కు షాకుల మీద షాకులు

జగన్మోహన్ రెడ్గికి తాజాగా నవయుగ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనుల నుండి తనను ఏకపక్షంగా తప్పించటాన్ని సవాలు చేస్తు  కంపెనీ యాజమాన్యం హై కోర్టులో కేసు వేసింది. తమను ఏకపక్షంగా ప్రాజెక్టు నుండి తప్పించటం వల్ల ఆర్ధిక నష్టమే కాకుండా ప్రతిష్ట కూడా దెబ్బతిన్నట్లు స్పష్టం చేసింది. కాబట్టి ప్రాజెక్టు పనులను ఇతర కంపెనీలకు కాకుండా మళ్ళీ తమకే అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కంపెనీ కోరింది.

ఇక్కడ రెండు విషయాలున్నాయి. మొదటిది ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నది వాస్తవం.  రెండోది జగన్ ఏకపక్షంగా పనులను నిలిపేయటం తప్పే. అవినీతి జరిగిందని అనుకున్నపుడు ఎక్కడెక్కడ ఎంతెంత జరిగిందో ఆధారాలతో బయటపెట్టాలి. అలాగే తక్కువ ధరలకే పనులను పూర్తి చేయించాలని అనుకున్నపుడు ముందుగా కంపెనీ యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడాల్సింది.

జగన్ పిలిపించి మాట్లాడినపుడు యాజమాన్యం గనుక ఒప్పుకోకపోతే అప్పుడు ఏమి చేయాలనే విషయంలో జగన్ నిర్ణయం తీసుకుని ఉండచ్చు. అందరూ ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. తెరవెనుక వ్యవహారాలు నడపటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. లీగల్ గా ఎక్కడా దొరక్కుండా తెరచాటు వ్యవహారాలను చంద్రబాబు జరిపించారనటంలో సందేహం లేదు. పైగా నవయుగ-చంద్రబాబు మధ్య విడదీయరాని బంధం ఉంది.

ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించాలన్న జగన్ ఆలోచన మంచిదే. కానీ అది న్యాయ సమీక్ష ముందు నిలబడాలి కదా ?  పైగా ప్రాజెక్టు పనులను అర్ధాంతరంగా నిలిపేయటం కేంద్రానికి, పోలవరం ప్రాజెక్టు అథారిటికి ఏమాత్రం రుచించటం లేదు. పైగా తెరవెనుక చంద్రబాబు మద్దతుంది. దాంతోనే నవయుగ కోర్టులో కేసు వేసుంటుందనటంలో సందేహం లేదు. మొత్తానికి తాజాగా కోర్టులో కేసు పడటమన్నది జగన్ కు షాకిచ్చేదే అనటంలో సందేహం లేదు.