జగన్ కు బిజెపి గాలమేస్తోందా

నిజానికి కేంద్రప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి మధ్య అంత సఖ్యత లేదన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉన్న ప్రభుత్వాలను అస్ధిర పరచాలన్న ధ్యేయంతోనే నరేంద్రమోడి సర్కార్ పావులు కదుపుతోంది. ఏపిలో బ్రహ్మాండమైన మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్ విషయంలో ఇప్పటికిప్పుడు బిజెపి తన వ్యూహాన్ని అమలు పరిచే అవకాశాలు లేవు. అందుకనే పరోక్షంగా సమస్యలు సృష్టిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు పై సమీక్ష, విద్యుత్ రంగంలో జరిగిన పిపిఏల సమీక్ష తదితరాలను కేంద్రం అడ్డుకుంటోంది. కేంద్రం వద్దన్నాసరే తాను అనుకున్నట్లుగానే ముందుకు పోవాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే మోడి-జగన్ ప్రభుత్వాల మధ్య కొంచెం ఘర్షణ వాతావరణం మొదలైంది. ఇక్కడే కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం జగన్ కు కేంద్రం దగ్గరవ్వాలని అనుకుంటోందా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రం తాజాగా నియమించిన అంతర్రాష్ట్ర మండలి స్ధాయి సంఘంలో జగన్ పేరును చేర్చింది కేంద్రం.  సిఎంలు సభ్యులుగా ఉండే ఈ సంఘంలో ఎవరిని నియమించాలన్నది పూర్తిగా ప్రధానమంత్రి ఇష్టమే. అలాంటిది ధక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒక్క జగన్ ను మాత్రమే సభ్యునిగా మోడి నియమించారు. జగన్ కన్నా సీనియర్లు ఉన్నప్పటికీ వారందిరినీ కాదని జగన్నే ఎందుకు నియమించారు ? అన్నదే ఇపుడు అందరికీ అనుమానం వస్తోంది.

ఏపిలో బిజెపికి ఏమాత్రం బలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉందని ఇక్కడి నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. జగన్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్ధితేంటో జాతీయ నాయకత్వానికి అర్ధమైనట్లుంది. కాబట్టి జగన్ తో గొడవ పెట్టుకుంటే వైసిపిని మరింత బలోపేతం చేసినట్లే అని భావించినట్లున్నారు. అందుకనే స్ధాయీ సంఘంలో సభ్యునిగా వేసి జగన్ కు గాలమేస్తున్నారా ? అని అనుమానం వస్తోంది.