రాష్ట్రంలో తనకు ఎదురులేదన్నట్లు ముందుకెళుతున్న జగన్ ఢిల్లీ రాజకీయంలో నలిగిపోతున్నారు. బీజేపీ, టీడీపీయే కాకుండా సొంత పార్టీ ఎంపీలు ఒకరిద్దరు కూడా హస్తినలో ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోడీ, అమిత్‌షాలను ప్రసన్నం చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతూనే పార్టీతో సంబంధం లేకుండా ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజును అదుపులో పెట్టలేక కస్సుబుస్సులాడుతున్నారు.
ఆరు నెలల క్రితం మునుపెన్నడూ చూడని విధంగా ఆంధ్రాలో స్టన్నింగ్ విక్టరీని అందుకుని మోడీ చేత శభాష్ అనిపించుకున్న జగన్ ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కూడా దొరక్క ఆపసోపాలు పడుతున్నారు. ఏపీలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలనే మోడీ–షా లక్ష్యం, జగన్‌ను వారికి దూరం చేసేలా చంద్రబాబు పన్నిన వ్యూహాలు జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మోడీ–షా ద్వయం జగన్ పట్ల అంత వ్యతిరేకతతో లేకపోయినా ఇటీవల కొన్ని పరిణామాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి.
జగన్ క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి అధికారులను అవమానకరంగా సాగనంపడంతోపాటు తాము చెప్పిన కొందరు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టడం వారికి రుచించడంలేదు. మొదట ఆర్పీ ఠాకూర్‌కు కీలక పదవి ఇవ్వాలని అమిత్‌షా చెప్పినా జగన్ లెక్కచేయలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మనీష్‌కుమార్ సిన్హాను నిఘా విభాగం చీఫ్‌గా నియమించడం వారికి అస్సలు మింగుడుపడలేదు. ఇవికాకుండా సుజనాచౌదరి జగన్‌పై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా హస్తినలో చేస్తున్న లాబీయింగ్, కేసీఆర్–జగన్ కలిసి పనిచేస్తున్నారనే వాతావరణంతో అన్ని రకాలుగా జగన్‌కు హస్తినలో ఇబ్బందికర వాతావరణం నెలకొంది.
మరోవైపు సొంత పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీతో సంబంధం లేకుండా ఢిల్లీలో హల్ చేస్తుండడం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల రఘురామకృష్ణంరాజును అమరావతికి పిలిపించుకుని ఢిల్లీలో హడావుడి చేయొద్దని వార్నింగ్ ఇచ్చినా ఆయన లెక్క చేయడంలేదు. జగన్, విజయసాయిరెడ్డి ప్రమేయం లేకుండా లోక్‌సభలోని పది స్థాయీ సంఘాల్లో రఘురామకృష్ణంరాజకు చోటుదక్కడం జగన్‌ను నివ్వెరపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో 300 ఎంపీలకు రఘురామకృష్ణంరాజు భారీ విందు ఏర్పాటు చేయడంతో జగన్‌కు బీపీ మరింత పెరిగిపోయింది. ఈ రాజుగారిని కట్టడి చేయలేక చివరికి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టే ఉద్ధేశంతో నర్సాపురంలో ఆయన ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కొడుకు, తమ్ముళ్లను పార్టీలో చేర్చుకున్నారు. అయినా రఘురామరాజు జగన్‌కు ఖాతరు చేసే పరిస్థితిలో లేరని సమాచారం.