జగన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,545 కోట్లు కాగా, రూ.48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.

ఇప్పటికే రూ.16వేల కోట్లు నిధులు ఖర్చు చేయగా, మిగిలిన రూ.32 వేల కోట్లు ఇస్తానని కేంద్రం స్పష్టం చేసింది. దానికి సంబంధించి.. రూ.5వేల కోట్లను ప్రాజెక్టు ఇంజనీరింగ్ పనుల కోసం, భూసేకరణ, పునరావాసం పనుల కోసం రూ.27వేల కోట్లను వెచ్చించనుంది. పునరావాసంపై పొరుగు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సమాంతరంగా పునరావాస పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొంది.

స్థానిక ఎన్నికల ముందు కేంద్రం ఈ ప్రకటన చేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. మూడేళ్లుగా సవరించిన నిధులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్న క్లారిటీ వచ్చేసింది.