అధికారంలోకి వచ్చినప్పటినుండి జగన్ సర్కార్‌కు కోర్టులలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా అంశాల్లో అక్షింతలు పడుతూనే ఉన్నాయి. తాజాగా స్థానిక ఎన్నికల అంశంలోనూ.. ఇప్పుడు కర్నూలుకు కార్యాలయాల తరలింపులోనూ ప్రభుత్వాానికి చుక్కెదురైంది. వీటన్నిటికి కారణం చంద్రబాబే అంటూ వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత మాత్రమో తెలియదు గానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం జగన్ సర్కార్ నిర్ణయాలను కోర్టుల ద్వారానే చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపాపై పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలని కోరారు. అలాగే స్థానిక ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై పోరాడాలని, ప్రతిచోటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లు సేకరించాలని నాయకులకు సూచనలు చేస్తున్నారు. వైకాపాబెదిరింపులకు పాల్పడినా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా సరే వాటికి సంబంధించి సాక్షాలు సేకరించాలని అన్ని సాక్ష్యాధారాలను ఆర్వోలకు, ఈసీకి పంపించాలని దిశా నిర్దేశం చేయడం చూస్తుంటే.. ఇకపై న్యాయస్థానాల ద్వారా పోరాటానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా స్థానిక ఎన్నికల ప్రక్రియలో వేలాదిమందిపై కేసులు బనాయించినట్లు, ఎస్‌ఈసీ రాసిన లేఖ కూడా ఇప్పుడు టీడీపీకి అస్త్రంగా మారింది. అలాగే ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలపై కూడా ఎక్కడికక్కడ కోర్టులలో కేసులు వేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అందుకోసం చట్టాలు, నిబంధనలపై అభ్యర్ధులు అవగాహన పెంచుకునేలా కూడా బాబు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా జగన్ సర్కార్‌కు న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటే.. ఇప్పుడు దాన్నే చంద్రబాబు తన అస్త్రంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. మరి చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా..? లేదా జగన్ సర్కార్ కోర్టులను ఎదుర్కొనేందుకు తన వ్యూహాలను మార్చుకుంటుందా అన్నది చూడాలి.