చాలా మంది గుడిలోకి వెళ్ళగానే చిల్లర డబ్బులను హుండీలో వేస్తూ ఉంటారు. ఈ మధ్య అది కాస్త తగ్గిందనిగాని అదివరకు రోజుల్లో అయితే మరీ ఎక్కువగా చిల్లర డబ్బులు చూసి మరీ గుడిలోకి తీసుకువెళ్ళేవారు జనం. ఎక్కువగా హిందూదేవాలయాల్లో ఇలా ఉంటుంది. ఇక పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలయితే మరీ ఎక్కువ దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇదే పరిస్థితి. దీనితో టీటీడీ గోడౌన్ లో ఉన్న దాదాపు 85 టన్నుల నాణాలను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పంపేందుకు టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
రోజు రోజుకి ఈ చిల్లర పెరగడంతో దాన్ని తగ్గించుకునే యోచనలో ఇలాంటి నిర్ణయాన్ని దేవస్థానం యాజమాన్యం తీసుకుంది. ఫిబ్రవరి మొదటివారంలోనే ఈ నాణాలను తమిళనాడులో ఉన్న సేలంలోని సెయిల్ కర్మాగారానికి పంపుతామని, అలాగే ఇవన్నీ ప్రస్తుతం చెలామణిలో లేనివేనని అధికారులు చెప్తున్నారు. గోడౌన్ లో చెల్లని నాణాలు అధిక స్థలాన్ని ఆక్రమించడంతో 2018లో చెల్లుబాటులో ఉన్న నాణాలను 90 వేల బ్యాగుల్లో బ్యాంకులకు పంపించారు అదికారులు.
వాటితో 30కోట్లకు పై ఆదాయాన్ని పొందింది టీటీడీ. ఇక జులై 2011 సంవత్సరం తరువాత పావలా అనగా 25 పైసలు కన్నా తక్కువ ఉన్న నాణాలన్నీ చెలామణి నుంచి తప్పించారు. ఇప్పుడు అలాంటి నాణాలన్నీ కూడా టీటీడీలో బాగా భారంగా మారాయి. వీటిని తీసుకుని కనీస ముఖ విలువ ఇచ్చినా చాలని ఆర్‌బిఐని సంప్రదించింది. దానికి వారు అంగీకరించలేదు దీంతో ముంబైలో ఉన్న మింట్‌ని సంప్రదించగా సేలం స్టీల్ ప్లాంట్‌కి వెళ్ళమని సూచించారు. మెట్రిక్ టన్ను నాణాలకు రూ. 29,972 ఇచ్చేందుకు సెయిల్ అంగీకరించింది. దీంతో గత ఏడాది ఏప్రిల్ 18 న ఇందుకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే.