చిదంబరం అరెస్టులో హై డ్రామా

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టయ్యారు. ఈడి, సిబిఐ అధికారులు చిదంబరాన్ని బుధవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లోనే అరెస్టు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో చిదంబరం అరెస్టయ్యారు.  అరెస్టయిన తర్వాతో లేకపోతే తమ బండారం బయటపడిన తర్వాతో అందరూ చెప్పేదే చిదంబరం కూడా చెప్పారు లేండి.

దొరికిన తర్వాత, అరెస్టయిన తర్వాత అందరూ చెప్పేదే చిదంబరం కూడా చెప్పారు. తాను సచ్చీలుడంటూ చిదంబరం మొదలుపెట్టారు. తన అరెస్టు తప్పదంటూ  డిసైడ్ అయిన తర్వాత 24 గంటలపాటు దర్యాప్తు సంస్ధలకు దొరక్కుండా తప్పించుకున్నారు. సుప్రింకోర్టు బెయిల్ పటిషన్ పై విచారణకు తొందరేమొచ్చిందంటూ ఎదరుప్రశ్నించేసరికి వేరే దారి లేక చివరకు చిదంబరం లొంగిపోయారనే చెప్పాలి.

24 గంటల పాటు హైడౌట్ లో ఉన్న చిదంబరం అరెస్టుకు మానసికంగా సిద్ధపడిన తర్వాతే ఏఐసిసి కార్యాలయంలో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన కేసులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. చిదంబరం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతున్న విషయం గమనించగానే దర్యాప్తు అధికారులు అప్రమత్తమయ్యారు.

చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు కార్యాలయానికి కొందరు, ఇంటికి కొందరు రెండు బృందాలుగా చేరుకున్నారు. మీడియా సమావేశం పూర్తికాగానే నేరుగా ఇంటికి వెళ్ళిపోయిన చిదంబరం అక్కడ కొంత డ్రామా నడిపారు. సిబిఐ అధికారులను ఇంట్లోకి రానీయకుండా తన మద్దతుదారులతో గేట్లు వేయించేశారు. అయినా సరే అధికారులు ఇంటి కాంపౌండ్ లోకి దూకి మరీ చిదంబరాన్ని అరెస్టు చేసి హెడ్ క్వార్టర్స్ కు తరలించారు.