అధికారంలో ఉన్నపుడు చేసిన అరాచకాలకు, పాల్పడిన దురాగతాలకు తెలుగుదేశంపార్టీ నేతలకు ఇపుడు చుక్కలు కనబడుతున్నాయి. మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఉదంతమే తాజా ఉదాహరణ. అధికారంలో తామే శాస్వతంగా ఉండిపోతామన్న భ్రమలో చాలామంది టిడిపి నేతలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దానికి చంద్రబాబునాయుడు కూడా ఊతమిచ్చారు.
సరే చంద్రబాబు ఏమనుకున్నా, అప్పటి ఎంఎల్ఏల, మంత్రులు ఏమి చేసినా జనాలైతే టిడిపి గూబ గుయ్యిమనిపించారు. దాంతో అప్పట్లో వాళ్ళు చేసిన పాపాలే ఇపుడు వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నాయి. అటువంటి టిడిపి నేతల్లో ముందుగా చెప్పుకోవాల్సింది చింతమనేని గురించే. దెందులూరు ఎంఎల్ఏగా చింతమనేని పదేళ్ళు పనిచేశారు. రెండోసారి గెలిచినపుడు అధికార పార్టీ ఎంఎల్ఏ హోదా దక్కించుకున్నారు. దాంతో చెలరేగిపోయారు.
చింతమనేని వవ్యహార శైలే భిన్నంగా ఉంటుంది. అధికారులను నోటికొచ్చినట్లు తిట్టటం, కొట్టడం ఈయనకు మామూలు. తన మాటకు ఎవరు ఎదురు చెప్పినా సహించలేరు. ఎదురుగా ఉన్నది ఎవరు అని కూడా చూడరు. అధికారులు, ఆడ, మగ, ప్రతిపక్ష పార్టీ, సొంతపార్టీ నేతలు, మామూలు జనాలు ఇలా ఎవరైనా ఒకటే చింతమనేనికి. అందుకనే చింతమనేని పై ఏకంగా 60 కేసులు నమోదయ్యాయి.
అధికారంలో ఉన్నపుడు చేసిన అరాచకాలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పండాయి. అందుకనే పోయిన నెలలలో ఎస్సీ వేధింపులపై కేసు నమోదైంది. ఆ కేసులోనే చింతమనేనికి రిమాండ్ పడింది. ప్రస్తుతం జైలులో ఉన్న చింతమనేనిని గురువారమే మరో కేసులో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
మొదటి కేసులో రిమాండ్ లో ఉన్న చింతమనేనికి రెండో కేసులో కోర్టు ఏమి చెబుతుందో చూడాలి. అంటే చింతమనేనిపై ఇంకా 58 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు . ఈ కేసుల నుండి బయటపడేటప్పటికి చింతమనేనికి చుక్కలు కనబడటం ఖాయం.