చంద్రబాబు ప్రజా బలం కోల్పోయారా?

డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు ప్రజలు గురికాకుండా చేసి ఎన్నికలు నిర్వహిస్తే ఏ ప్రతిపక్షానికి అయినా సంతోషం కలగాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్న స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురిచేసేదిగా ఉంది అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీకే కలిసొచ్చేదిగా కనిపిస్తోంది.

జగన్ సర్కార్ పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు (డబ్బు, మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలను నిర్వహించడం) తీసుకొచ్చిన విషయం విధితమే. ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకుండా స్థానిక ఎన్నికల కోసం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై చంద్రబాబు ప్రతి పక్షాలను భయపెట్టడానికే ఈ నిర్ణయాలు అంటూ వ్యాఖ్యలు చేసి అబాసు పాలవుతున్నారు. ప్రజా బలం కోల్పోయినవారే ఇలా ప్రవర్తిస్తారని వైసీపీ నేతల విమర్శలను ఎదుర్కొంటున్నారు.

చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, ఆయన బేలతనం చూపలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొనడం చూస్తుంటే.. చంద్రబాబు నిజంగానే ప్రజా బలం కోల్పోయారా అన్నఅనుమానాలు టీడీపీ శ్రేణుల్లోనే రేకెత్తుతున్నాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, పార్టీ శ్రేణులను ఎలా సమాయత్తం చేయాలి అన్న దానిపై పూర్తి స్తాయిలో దృష్టి పెడితే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉందనే వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. పార్టీ సీనియర్లు సైతం ఇదే కోరుకుంటున్నారు. చంద్రబాబు మరోసారి అన్నీ తానై పూర్తి స్థాయిలో కార్యకర్తల వద్దకు వెళ్తే తప్ప పరిస్థితులు మారవని చర్చించుకుంటున్నారు. మరి చంద్రబాబు ఆ పనిచేస్తారా.. ప్రజా బలాన్ని కూడగట్టుకుంటారా లేదా అన్నది.. ఈ ఎన్నికల్లో చూడాలి.