చంద్రబాబు నాయుడు లక్ష్యంగా జరుగుతున్న IT దాడులు!

40 యేళ్ళ అనుభవం నేర్పని పాఠాలు

అవును అనే సమాధానమే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్ల పాటు ఆయన వద్ద పియస్ గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ రావు ఇంటిలో అదీ అయిదు రోజుల పాటు ఐటి శాఖ అధికారులు సోదాలు సాగించారంటే ఇంత కన్నా ప్రబల నిదర్శనం మరొకటి లేదని ఈ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇంటిపై నేరుగా దాడులు సాగించితే రాజకీయ రంగు పులుముకొనే అవకాశం వుందని సన్నిహితుల ఇళ్లల్లో ముందుగా సోదాలు సాగించి ఆధారాలు రాబట్టి తదుపరి తమ లక్ష్యం నెరవేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఈ లాంటి సంఘటన ఇదివరలో లేదు. 2004 లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినపుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వున్నా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులపై ఐటి దాడులు జరగ లేదు. కాని ఇప్పుడు తద్భిన్నంగా జరిగింది. అయితే మరో వేపు పోలవరం ప్రాజెక్టు విద్యుత్ కొనుగోళ్ల అంశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు అమలు చేశారని చిత్రించినా కేంద్రం మాత్రం చంద్రబాబు నాయుడును కాపాడినట్లు వ్యవహరించింది. అదంతా కేవలం పారిశ్రామిక వేత్తలు కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాపాడటానికే తప్ప చంద్రబాబు నాయుడును సమర్థించడం కాదని తర్వాత జరిగిన ఈ ఐటి దాడులు నిర్థారించాయి. ఇప్పుడు ఐటి దాడులతో చంద్రబాబు నాయుడు మీద మోదీ ప్రభుత్వం ఏ ధోరణితో వుందో బహిర్గతమైందంటున్నారు.
ఒక వైపు శ్రీనివాస్ రావు ఇంట్లో సోదాలు సాగిస్తూ మరో వైపు టిడిపి జాతీయ కార్యదర్శి చంద్ర బాబు నాయుడు తనయుడు లోకేష్ కు సన్నిహితుడైన కిలారి రాజేష్ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. వీరిరువురు చంద్రబాబు నాయుడు కుటుంబానికి దగ్గరగా వుండటం గమనార్హం. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తనయుడు కంపెనీలపై కూడా దాడులు జరగడం ఏదైనా కూపీ లాగేందుకేనని భావిస్తున్నారు.

ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు. 2019 ఎన్నికల మునుపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి మోదీని వ్యక్తి గతంగా టార్గెట్ చేశారు. తుదకు రాజకీయాల్లో తన కన్నా జూనియర్ అని నిందించడం జరిగింది. పైగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేశారని కూడా ప్రధాన మంత్రి నమ్ముతున్నట్లు చెబుతున్నారు.ఇవన్నీ అటుంచి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. ఇక టిడిపికి భవిష్యత్తు లేదని టిడిపి నేతలు వరస బెట్టి బిజెపిలోకి దూకుతారని ఊహించారు. కాని క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నంగా తయారైంది. టిడిపి నేతల్లో వ్యాపారాల్లో పన్నులు ఎగ్గొట్టి వారు ప్రజల్లో పలుకుబడి లేని వారు తప్ప మిగిలిన వారు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మనో ధైర్యం దెబ్బ తీసి ఆత్మ రక్షణలో పడేస్తే తప్ప మరో మార్గం లేదని ఈ దాడులు సాగించినట్లు భావిస్తున్నారు. ఐటి అధికారులు దాడులు నిర్వహించిన తర్వాత ఎటుంవంటి ప్రకటన చేయ లేదు. ఇంకా లోతుపాతులు పరిశీలించి నేరుగా చంద్రబాబు నాయుడు మీదే వేటు వేస్తారని ఆయన ప్రత్యర్థులు చెబుతున్నారు. కాని టిడిపి వర్గాలు మాత్రం ఐటి అధికారులకు పెద్దగా ఏమీ లభ్యం కాలేదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి