చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైంది. పోలవరం అవినీతిపై విచారణ జరిపించాలని ఢిల్లీ హై కోర్టు కేంద్ర జలవనరుల శాఖ ను ఆదేశించటం చాలా కీలకమైన పరిణామమనే చెప్పాలి. పోలవరం అవినీతిపై జగన్మోహన్ రెడ్డి నిపుణుల కమిటితో దర్యాప్తు చేయించటాన్ని చంద్రబాబు ఎన్నిసార్లు తప్పు పట్టారో అందరికీ తెలిసిందే. జగన్ నిర్ణయమే కరెక్టని తాజాగా హై కోర్టు ఆదేశాలతో తేలిపోయింది.
పోలవరం, పిపిఏల సమీక్ష లాంటి నిర్ణయాలు తీసుకున్నపుడు చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా కూడా ఒకటే గగ్గోలు పెట్టేసింది. జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం పరువు బజారున పడిపోయిందని, రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదని నానా యాగీ చేశారు. మరి ఇపుడు పోలవరంలో అవినీతి జరిగిందని దాఖలైన పిటీషన్ పై విచారణ జరపమని హై కోర్టు చెప్పటాన్ని కూడా చంద్రబాబు, ఎల్లోమీడియా తప్పు పడతారా ?
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎం లాగ ఉపయోగించుకుంటున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే మొన్నటి ఎన్నికల సమయంలో బహిరంగ సభలో ఆరోపించారు. అప్పటి ఆరోపణలను బట్టి చంద్రబాబుపై విచారణ జరిపించటం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే రెండోసారి అధికారంలోకి రాగానే మోడి అసలా విషయాన్నే మరచిపోయినట్లున్నారు.
అయితే మోడి మరచిపోయిన విషయాన్ని హై కోర్టు గుర్తు చేసింది. అందుకనే జలవనరుల శాఖతో వెంటనే విచారణ చేయించమంటూ కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. మరిపుడు ప్రధాని, జలవనరుల శాఖ మంత్రి ఏం చేస్తారో చూడాలి.