చంద్రబాబు నాయుడు వద్ద పియస్ గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ రావు ఇంటిపై ఐటి అధికారులు దాడులు జరపడమే ఒక సంచలనం. ఎందుకంటే ఒక మాజీ ముఖ్య మంత్రి వద్ద పని చేసిన అధికారి ఇంటిలో సోదాలు జరిగితే విధిగా ఆ విఐపి పై తప్పక ప్రభావం వుంటుంది. విఐపి ని దృష్టిలో పెట్టుకునే దాడులు జరిగాయని భావించేందుకు ఆస్కారముంది.
సాధారణంగా ఒకటి రెండు రోజులు జరిగే సోదాలు అయిదు రోజులు పాటు జరిగాయంటే రెండు అంశాలు ఇమిడి వుంటాయి. తాము ఊహించిన దానికన్నా ఎక్కువగా లోపాలు తప్పులు జరిగి వుంటే పరిశీలనకు సమయం ఎక్కువ పట్టివుండాలి. లేదా ఏమీ దొరకకుండా వుంటే మరీ లోతులకు వెళ్లి ఏదో ఒక లోపం వెతికి పట్టుకొనేందుకు పరిశీలనకు ఎక్కువ కాలం తీసుకొని వుండాలి. వాస్తవంలో ఏమి జరిగిందో ఏమో గాని దేశ వ్యాప్తంగా 40 చోట్ల దాడులు చేసిన ఐటి శాఖ విడుదల చేసిన ప్రకటన అస్పష్టంగా వుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పేరు పరోక్షంగా తేవడం రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణం ఎటూ కాకుండా ప్రస్తావించడం వైసిపి పార్టీ చేతికి పదునైన ఆయుధం దొరికినట్లయింది. దానితో వైసిపి నేతలు మూకుమ్మడిగా దాడి పెంచారు. టిడిపి నేతలు గుక్క తిప్పుకోలేనీ విధంగా విరుచుకుపడ్డారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేక ప్రచారం పెంచారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని కలవడం ఈ అంశం ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు లీకులు రావడం కూడా టీడీపీ నేతలను ఆత్మ రక్షణలో పడవేసింది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడానికే శ్రీనివాస్ రావు ఇంటిలో సోదాలు చేశారనే భావన కలిగించారు. ఎప్పుడూ లేని విధంగా గురువారం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లడం ఆయన ఈ విషయమై నోరు విప్పక పోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడును దోషిగా వైసిపి నేతలు నిలబెట్టారు. టిడిపి నేతలు ఇద్దరు ముగ్గురు మాత్రం చొరవ తీసుకుని తుదకు శ్రీనివాస్ రావు ఇంట్లో దొరికింది కేవలం 80 వేల రూపాయలని వివరణ ఇచ్చినా అది అంతగా పేల లేదు. . అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ఇదిలా వుండగా టిడిపి నేతల కన్నా టిడిపి అనుకూల మీడియా చంద్రబాబు నాయుడును కొంత మేరకు కాపాడింది. ప్రజల దృష్టి మరల్చగలిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ పూర్తి పాఠం ప్రకటించి ముఖ్యమంత్రి వ్యక్తత్వాన్ని ఖరాబు చేయడం కొసమెరుపు. ఒక విధంగా అధికార ప్రతి పక్షాలు ఒకరిపై మరొకరు పై చేయి సంపాదించడానికి మాటల యుద్ధం ఈ రోజు సాగించారు.