మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేశారంటూ ప్రభుత్వమే కోడెలపై ఫిర్యాదు చేసింది. దాంతో తుళ్ళూరు పోలీసుస్టేషన్లో కోడెలపై వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. స్పీకర్ గా పనిచేసిన నేతపై కేసు నమోదవ్వటం రాష్ట్రచరిత్రలో ఇదే మొదటిసారేమో ?
ఇంతకీ విషయం ఏమిటంటే ఏపి ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్నపుడు హైదరాబాద్ లో కోడెల ఇంటికి ప్రభుత్వమే ఏసిలతో కలుపుకుని సకల ఫర్నీచర్ ను సమకూర్చింది. తర్వాత హఠాత్తుగా విజయవాడ ప్రాంతానికి మార్చేసింది. అయితే హైదరాబాద్ నుండి అమరావతికి మారేటపుడు హైదరాబాద్ లోని ఫర్నీచర్ మొత్తాన్ని కోడెల తన ఇంటిలోనే ఉంచేసుకున్నారు. అమారవతికి మారినపుడు మళ్ళీ అక్కడ వేరే ఫర్నీచర్ ను కొనుగోలు చేయించారు. అంటే ప్రభుత్వ ఆస్తిని కోడెల దుర్వినియోగం చేసినట్లు స్పష్టమవుతోంది.
అలాగే అమరావతి ప్రాంతంలో కొనుగోలు చేయించిన ఫర్నీచర్ లో కొంత తన సొంత ఇంటికి తరలించారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ ఆరోపణలపై చీఫ్ సెక్రటరి విచారణ చేయించి నిర్ధారణ చేసినట్లు సమాచారం. దాంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంబంధింత అధికారులు కోడెలపై కేసు పెట్టటం, ఎఫ్ఐఆర్ నమోదవ్వటం చాలా స్పీడుగా జరిగిపోయింది.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని జనాలను దోచేశారనే ఆరోపణలపై ఇంతకాలం కొడుకు శివ రామకృష్ణ, కూతురు విజయలక్ష్మి మీద మాత్రమే సుమారు 20 కేసులు పెట్టారు. ఇపుడు కోడెల మీద కూడా కేసు నమోదవ్వటంతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో మామూలు జనాలు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. అలాగే టిడిపిలోని కోడెల వ్యతిరేకులు కూడా హ్యాపీనే.