అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్యకు సంబంధించిన వివాదంపై చంద్రబాబునాయుడు నెత్తిన బిజెపి పెద్ద బాంబు వేసింది. కోడెల ఆత్మహత్యకు మీరే కారణమంటే కాదు మీరే కారణమంటూ టిడిపి, వైసిపి నేతలు వాదులాడుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే. ఒక వైపు ఈ వివాదం తారస్ధాయికి చేరుకున్న నేపధ్యంలోనే బిజేపి చేసిన ఓ ప్రకటన చంద్రబాబును ఇరకాటంలోకి పడేసింది.
బిజెపి అధికార ప్రతినిధి పురిపళ్ళ రఘురామ్ చెప్పినదాని ప్రకారం చంద్రబాబు వల్లే కోడెల మానసిక క్షోభకు గురయ్యారు. నెల రోజుల క్రితం రఘురామ్ కు కోడెల ఫోన్ చేసి మాట్లాడారట. టిడిపిలో తాను ఒంటరి వాడిని అయిపోయినట్లు కోడెల బాధపడ్డారట. చంద్రబాబు తనను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలైనట్లు తెలిపారు.
నిజాయితి కలిగిన నేతలకు టిడిపిలో విలువ లేదని చెప్పిన కోడెల తాను టిడిపికి రాజీనామా చేయాలని అనుకున్నట్లు కూడా చెప్పారట. తాను బిజెపిలో చేరాలని డిసైడ్ అయ్యానని చెప్పినట్లు రఘురామ్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. తనకు అమిత్ షా అపాయిట్మెంట్ ఇప్పించాలని కూడా కోడెల కోరారట. తాను మాట్లాడి ఏ సంగతి చెబుతానని చెప్పినట్లు రఘురామ్ స్పష్టం చేశారు.
తాను ఏ సంగతి చెప్పేలోగానే కోడెల ఆత్మహత్య చేసుకోవటం నిజంగా దురదృష్టకరమంటూ రఘురామ్ ఓ ప్రకటనలో వాపోయారు. అంటే బిజెపి నేత చెప్పినది చూస్తుంటే కోడెల ఆత్మహత్యకు మానసిక క్షోభే కారణమని తేలిపోయింది. కోడెలను మానసిక క్షోభకు గురిచేసింది కూడా చంద్రబాబే అని రఘురామ్ చెప్పినదాన్ని బట్టి తేలిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అండ్ కో బురదచల్లుతున్నట్లు స్పష్టమైపోతోంది.