మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు చనిపోవటానికి కొడుకు కోడెల శివరామకృష్ణే కారణమా ? కోడెలను కొడుకే హత్య చేశాడా ? అవుననే అంటున్నాడు కోడెల సమీప బంధువు. కోడెలకు మరిది అయ్యే కంచేటి సాయిబాబు ఇదే ఆరోపణలతో సత్తెనపల్లి డిఎస్పీకి రాత మూలకంగా ఫిర్యాదు కూడా చేశారు. తన బావ ఉరేసుకుని చనిపోలేదని కొడుకు శివరామకృష్ణే చంపేశాడని ఫిర్యాదులో చెప్పారు.
చాలా కాలంగా తండ్రి, కొడుకుల మధ్య గొడవలు అవుతున్నట్లు ఫిర్యాదులో ఉంది. తండ్రి పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ తన పేరుమీదకు మార్చమని కొడుకు తనను ఒత్తిడి తెస్తున్నట్లుగా కోడెల తనతో చెప్పుకుని బాధపడినట్లు సాయి ఫిర్యాదులో స్పష్టంగా చెప్పారు.
కొడుకు వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా కోడెల తనతో రెండు, మూడుసార్లు చెప్పుకుని భయపడినట్లు కూడా సాయి అంటున్నారు. తన కొడుకుతో మాట్లాడమని కోడెల చెబితే మాట్లాడేందుకు తాను ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనతో మాట్లాడేందుకు శివరామ్ ఇష్టపడలేదని కూడా ఫిర్యాదులోనే చెప్పారు.
ఇద్దరితోను మాట్లాడి సమస్యను పరిష్కరిద్దామని తాను అనుకునేంతలోపే కోడెల ఆత్మహత్య చేసుకున్నారనే వార్తతో తాను షాక్ కు గురైనట్లు సాయి అన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కూడా చెప్పారు. కోడెల మృతి వెనుక కారణాలపై పోలీసులు విచారణ జరపాలని తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.