విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్రం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్రం పేర్కొన్న అంశాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.. తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్లాంటుని విక్రయించడానికే కేంద్రం నిర్ణయం తీసుకుందనీ, పరిశ్రమ అమ్మకాన్ని ఎవరూ వ్యతిరేకించజాలరనీ, ఉద్యోగులకు అలాగే కార్మికులకు ఎలాంటి హక్కులూ రాజ్యాంగం కల్పించలేదనీ కేంద్రం ఆ అఫిడవిట్ ద్వారా పేర్కొంది. దాంతో, విశాఖ స్టీలు ప్లాంటు ఉద్యోగులు, కార్మికులు, కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగాలంటే, ముందు ప్లాంటుని కొనుక్కునేవారు పరిశీలించాలి కదా..
మమ్మల్ని దాటి ఎలా పరిశ్రమలోనికి వెళతారు.? అంటూ ఉద్యోగులు, కార్మికులు తెగేసి చెబుతున్నారు. నిజానికి, ఇదొక అవాంఛనీయమైన పరిస్థితి. అత్యంత దారుణమైన వ్యవహార శైలి కేంద్రానిది ఈ విషయంలో. విశాఖ ఉక్కు పరిశ్రమ ఎందరో ప్రాణ త్యాగాలతో ఏర్పడింది. అలాంటప్పుడు, కేంద్రానికి తప్ప ఎవరికీ హక్కు లేదని మోడీ సర్కార్ చెప్పడమేంటి.? కోర్టులు సైతం ప్రశ్నించజాలవని అఫిడవిట్ వేయడమేంటి.? ఏ ప్రభుత్వానికైనా ప్రజలు అధికారమిచ్చేది ఐదేళ్ళు పాలించమని మాత్రమే. ఐదేళ్ళ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వాల విధానాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇప్పుడు అధికారంలో వుందని బీజేపీ ప్రభుత్వం పరిశ్రమను అమ్మేస్తే, రేప్పొద్దున్న అలాంటి పరిశ్రమను ప్రభుత్వం నెలకొల్పగలదా.? ప్రజలకు ప్రభుత్వాల మీద విశ్వాసం వుంటుందా.? దేశ ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలో విశాఖ స్టీలు ప్లాంటుని అమ్మేస్తున్నామనే మోడీ సర్కార్ వాదనే అర్థరహితం.