(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 4 ఏళ్ల తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరారు. ప్రజాదరణ ఉన్న నేత కాక పోయినా అత్యంత ప్రతిభావంతుడైన నేత అనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లిన ఒక నాటి పేరున్న నాయకుడు అమరనాధ్ రెడ్డి కుమారుడు కిరణ్. నల్లారి రాజకీయ వారసుడు గా రంగప్రవేశం చేసిన కిరణ్ జిల్లా రాజకీయ సమీకరణాలులో తనదైన ముద్ర వేశారు. వైరి వర్గాలను, ధీటుగా ఏదుర్కొనడంలో కిరణ్ దిట్ట. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతర పరిస్థితి లో రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ రెడ్డి కి అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో ఎంఎల్ ఎ లలో పట్టు లేకపోయినా మంత్రిగా అనుభం లేకపోయినా కిరణ్ సమర్థతను చాటుకున్నారు. హైదరాబాద్ లోఎంఐఎం నేతను అరెస్టు చేయడం కిరణ్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో కిరణ్ అనివార్యంగా కాంగ్రెస్ నుంచి బయటికి రావలసి వచ్చింది.
విభజన, వై యస్ మరణం జగన్ పార్టీ పెట్టడం తో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయి నామమాత్రంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కిరణ్ చేరడం తో కాంగ్రెసు నడకలో మార్పులు వస్తాయా అన్నది చూడాలి.
విభజన తర్వాత కాంగ్రెస్ ఏ పి లో అనుసరించిన రాజకీయ విధానం ప్రజలను ఆకట్టుకోలేదు. విభజన కు బాధ్యత గా తీసుకుని దాని కారణముగా ఏ పికి జరిగిన నష్టానికి ప్రతిఫలంగా విలువైన విభజన చట్టాన్ని ఏ పి కి హక్కుగా ఇచ్చామని, ఈ విభజన చట్టాన్ని అమలు చేయడం ద్వారా ఏ పి కి మేలు ఎలా ఉంటుందో ప్రజలకు వివరించాలి. ఇలా చేస్తూ ప్రజల విశ్వాసం పొందడానికి అవసరమయిన కార్యాచరణ చేయడానికి కాంగ్రెస్ ఏనాడు ప్రయత్నం చేయలేదు. చట్టంలో లేని హోదా గురించే కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనలు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే కిరణ్ మాట్లాడుతూ విభజన చట్టం అమలు జరగకపోవడం వలన తెలంగాణ, ఏ పి లుకు నష్టం వాటిల్లిందని తిరిగి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినపుడే విభజన చట్టం అమలు చేయడం జరుగుతుందని, రెండురాష్ట్రాలకు న్యాయం చేయడానికి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందనిచెప్పారు. ప్రతిభావంతులైన నేతలకు మిగిలిన వారికీ ఉన్న వ్యత్యాసం అది. అలా చేరిన వెంటనే కాంగ్రెస్ కు వైద్యము ఎలా ప్రారంభించాలో కిరణ్ కనిపెట్టినారు. కిరణ్ రాక తో కాంగ్రేస్ వెంటనే పుంజుకొక పోయిన పార్టీ నడక మాత్రం మారనున్నదనేది మాత్రం ఖాయం.
(అభిప్రాయలు రచయిత వ్యక్తిగతం)