కియా ప్రచారం వల్ల జగన్ ఇమేజి డ్యామేజీ?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్ప బడిన ఫ్యాక్టరీల్లో అనంతపురం జిల్లాలోని కియా అతి పెద్దది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ అతి కష్టం మీద ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చింది. అప్పట్లో ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన రాయితీలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. భూమి చదును చేసి ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాదాపు 650 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది. గత డిసెంబర్ లో పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఫ్యాక్టరీ చేరుకున్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కార్లు విడుదల చేయ బడ్డాయి.

ఈ కర్మాగారంలో వార్షిక ఉత్పత్తి మూడు లక్షల కార్లుగా వుంటాయని 12 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పన జరుతుందని చెబుతున్నారు. అయితే రాయిటర్ వార్త సంస్థ సంచలనం కలిగించే వార్త ఇచ్చింది. గత ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి కల్పించిన రాయితీలను ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలించి కోత పెట్టే అవకాశాలు వున్నందున కియా తమ ఫ్యాక్టరీని తమిళ నాడుకు తరలించేందుకు సాధ్యాసాధ్యాలపై తమిళ నాడు అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నదనేది ఢిల్లీ నుండి ఈ సంస్థ వెల్లడించిన వార్త సారాంశం.తమతో ప్రాథమికంగా చర్చలు జరిపిందని వచ్చే వారం కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరుగుతాయని తదుపరి స్పష్టత వస్తుందని తమిళ నాడు అధికారి వెల్లడించినట్లు రాయిటర్ తెలిపింది. అయితే కియా సంస్థ మాత్రం అటు వంటి ప్రతిపాదన తమ వద్ద లేదని స్పష్టం చేసింది. అంతేకాదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి మాట్లాడుతూ ఇదంతా కట్టుకథ అని కియా తరలించడం జరగదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మ వద్దని చెప్పారు. అయితే వార్త రాయిటర్ ఇచ్చింది కాబట్టి ఎవరికైనా సందేహం కలుగక మానదు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందమైంది. ప్రభుత్వం మరియు కియా మోటార్స్ యాజమాన్యం స్వయంగా వివరణ ఇచ్చినప్పిటికి తెలుగు దేశం అనుకూల మీడియా వల్ల ముఖ్యమంత్రి ఇమేజీకి జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది