Kia: ఇన్నోవా, XL6 కి పోటీగా కియా నుంచి బడ్జెట్ కారు.. లుక్కు మామూలుగా లేదు!

Kia Carens Clavis: కియా ఇండియా మరోసారి భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న కారెన్స్ మోడల్‌కు అదనంగా, సరికొత్త ప్రీమియం మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) “కియా కారెన్స్ క్లావిస్”ను పరిచయం చేసింది. మే 9న బుకింగ్‌లు ప్రారంభం కానుండగా, ధరలను మే 23న అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కొత్త వాహనం ఆకర్షణీయమైన రూపం, ఆధునిక ఫీచర్లతో కియా అభిమానులలో ఆసక్తి రేపుతోంది.

డిజైన్ విషయానికి వస్తే, కారెన్స్ క్లావిస్ అంతర్జాతీయ కియా EV5 నుంచి స్ఫూర్తి పొందిన ముందు రూపం, కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్లు, 17 అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్‌తో ఆకర్షణీయంగా ఉంది. వెనుక భాగంలోని కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు వాహనానికి మరింత స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. మొత్తం ఎనిమిది రంగులలో ఇది లభ్యం కానుంది, అందులో ఐవరీ సిల్వర్ గ్లాస్ ప్రత్యేకం.

ఇంటీరియర్‌లో 6 లేదా 7 సీట్ల ఆప్షన్లు, నేవీ-బీజ్ కలర్ థీమ్, 12.3-అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లతో విభిన్నమైన డ్రైవింగ్ అనుభవం అందించనుంది. పనోరమిక్ సన్‌రూఫ్, బోస్ సౌండ్ సిస్టమ్, వెంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి పలు లగ్జరీ ఫీచర్లు ఉన్నవి. భద్రత విషయానికొస్తే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు కారును మరింత ప్రత్యేకంగా నిలిపేస్తున్నాయి.

ఇంజిన్ విభాగంలో మూడు ఆప్షన్లు: 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, వీటికి మాన్యువల్, ఆటోమేటిక్, iMT, DCT గేర్‌బాక్స్ లభ్యం. మొత్తం ఏడు వేరియంట్లలో వచ్చే ఈ ఎంపీవీ, ధర సుమారుగా రూ.11 లక్షల నుంచి ప్రారంభమవుతుందని ఊహిస్తున్నారు. మార్కెట్లోని ఎర్టిగా, XL6, రూమియన్, ఇన్నోవా వంటి మోడళ్లకు దీని నుంచి గట్టి పోటీ ఎదురవనుందని పరిశీలకుల అభిప్రాయం.

2029 లో జగన్ వైపు జనాలు చూస్తారా..? Will People Look Towards YS Jagan in AP Next Elections 2029 | TR