చంద్రబాబు పేరు చెప్తే ఆవేశంలో ఊగిపోయే వైకాపా ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మరోసారి బాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చావులను రాజకీయాలకు వాడుకునే టీడీపీ నేతలు.. కరోనాకు భయపడి ప్రాణాలను కాపాడుకునేందుకు హైదరాబాద్కి వెళ్లి గాజు గదిలో దాక్కున్న చంద్రబాబు.. అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలోనూ చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
విపక్షాలు వాలంటీర్ల మీద చేస్తున్న విమర్శలపై నాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన వాళ్లే ఇప్పుడు వాలంటీర్లతో సరుకులు పంపమని చెప్పడం వింతగా ఉందట. ఇళ్లకే సరుకులు పంపాలన్న లక్ష్యం నెరవేరేందుకు మరికాస్త సమయం పడుతుందని తెలిపారు. చివరి లబ్దిదారుడి వరకు అందరికీ రేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు కేటాయించే సమయం కన్నా బాబును విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చిన నాని.. కరోనా విపత్తు సమయంలోనూ చంద్రబాబు నాయుడు కుళ్లు రాజకీయాలు మానుకోలేదన్నారు. కరోనా వైరస్ కంటే ఎల్లో వైరస్ ప్రమాదకరంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు గాలికొదిలి, ప్రాణ భయంతో కుటుంబంతో కలిసి బాబు హైదరాబాద్లో ఉంటున్నారట. కేవలం నాని మాత్రమే కాదు.. వైకాపా మంత్రులు, నేతలు ఎవరు మాట్లాడినా బాబుపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మరి చంద్రబాబు వైకాపా నేతల విమర్శలకు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.